
రుణమాఫీ జాబితాలెక్కడ?
ఏలూరు:జిల్లాలో రుణమాఫీకి అర్హులైన వారి జాబితాల ప్రకటనలో ఆలస్యంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. చంద్రబాబు ఆర్భాటపు ప్రకటన తప్ప ఆచరణలో అధికారులు మాత్రం వివరాలను అందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈనెల ఆరో తేదీన రూ.50 వేల లోపు రుణం మాఫీ అయ్యేవారి జాబితాలను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నప్పటికీ ఎక్కడా వాటి ఊసేలేదు. శ నివారమే ఈ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. ఆదివారం అందరికీ సెలవు కావడంతో ఆరో తేదీన అధికారులెవరూ దీనిపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. లీడ్‌బ్యాంక్ పరిధిలోని 510 బ్రాంచిల్లోను జాబితాలు ఆన్‌లైన్‌లో హైదరాబాద్ నుంచి వచ్చినప్పటికీ అవి బ్రాంచిల్లో ప్రదర్శనకు ఉంచలేదు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోను, 257 సోసైటీల పరిధిలోను అర్హుల జాబితాలు వచ్చినప్పటికీ అక్కడక్కడా మాత్రమే వీటిని ప్రదర్శనకు ఉంచారు. డీసీసీబీ పరిధిలో 2.06 లక్షల మందికి రూ.994 కోట్ల మేర రుణమాఫీ చేయాలని ప్రతిపాదించగా, ఇందులో 12వేల ఖాతాలకు ఆధార్ సమర్పించకపోవడంతో వాటిని రెండో విడతలో తీసుకునే అవకాశం ఉంది. కాగా రూ.50వేల లోపు రుణం తీసుకున్న వారి వివరాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీకి ఎంతమంది అర్హులనేది కూడా లీడ్‌బ్యాంకు అధికారుల వద్ద, డీసీసీబీ వద్ద సమాచారం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇంత ప్రతిష్టాత్మకమైన విషయంపై అధికారులు కనీసం వాకబు చేసే పరిస్థితిలో ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం నాటికి రూ.50వేల లోపు రుణమాఫీకి అర్హులెంతమనేది తేలే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికీ సమాచారం వెల్లడించలేని అధికారులు పదో తేదీలోగా రైతుల ఖాతాలకు ఆయా రుణమాఫీ సొమ్మును జమ చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.