తాయిలాల ‘రచ్చ’ | politics rachabanda | Sakshi
Sakshi News home page

తాయిలాల ‘రచ్చ’

Published Mon, Nov 11 2013 3:03 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

politics rachabanda

 బండసాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  ఆరు అంశాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మూడో విడత రచ్చబండకు అధికారులు జిల్లాలో సోమవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 11 నుంచి 26 వరకు నిర్వహించే రచ్చబండలో పూర్తిగా ‘అధికార’ ము ద్ర ఉండేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఎంపీటీసీ, మున్సిపల్‌తోపాటు 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా  కార్యక్రమాల రూపకల్పన జరిగిందంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. మొదటి, రెండో విడతల్లో స్వీకరించిన దరఖాస్తులకు ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. మూడో విడతలో ‘తాయిలాలు’గా పరిష్కారం చూపే అవకాశం ఉంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలతోపాటు ఇందిరమ్మ కలలు, బంగారుతల్లి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లపై శంకుస్థాపన తదితర ఆరు అంశాలకు మూడో విడతలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
 ఇందుకోసం అధికారపార్టీకి లబ్ధిచేకూరే విధంగా ఇన్‌చార్జి మంత్రితోపాటు సర్పంచ్, మరో ఇద్దరితో వేసిన కమిటీల ద్వారా దరఖాస్తులు స్వీకరించి లబ్ధిచేకూర్చనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మొదలయ్యే రచ్చబండ తూర్పులో వాంకిడి, పశ్చిమలో బోథ్ మండలాల్లో సోమవారం ప్రారంభం కానుంది.
 మూడో విడత రచ్చబండ పరిస్థితి ఇదీ..
 రచ్చబండ మూడో విడతలో అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్తున్నా... ప్రధానంగా ఆరు అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే డీఆర్డీఏ పీడీ, డీఎస్‌వో, హౌసింగ్ పీడీ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల డీడీలు కచ్చితంగా రచ్చబండకు హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది. పలు సమస్యలు జిల్లాలో రాజ్యమేలుతున్నా, ఎన్నికల ముందు జనాకర్షక పథకాలకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటి, రెండో విడతల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు.

రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, ఇందిరమ్మ కలల కింద అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఎస్సీ, ఎస్టీ బకాయిలు ఉన్న విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఈ రచ్చబండలో అధిక ప్రాధాన్యం ఉంది. కాగా మూడో విడత రచ్చబండలో 45,294 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. అలాగే 11,210 పింఛన్లు, 11,210 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన 28,603 మంది విద్యుత్ వినియోగదారుల బకాయిలను మాఫీ చేయనున్నారు.
 రచ్చబండపై అధికార పార్టీ దర్పం
 మూడో విడత రచ్చబండపై ఈ సారి అధికార పార్టీ ముద్ర కనిపించనుంది. రచ్చబండ నిర్వహించే మండలాల్లో కమిటీలు కీలకపాత్ర నిర్వహించనుండగా... ఆ కమిటీలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి వేయనున్నారు. జిల్లా ఇన్‌చార్జికి తోడు ఆయన వేసే కమిటీలో సర్పంచి, మహిళా సభ్యురాలితోపాటు మరొకరు ఉంటారు. ఈ కమిటీలను ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రశాంతంగానే పూర్తయినా... ఎమ్మెల్యేలు లేనిచోట అధికార పార్టీలో గ్రూపుల కారణంగా కమిటీల ప్రక్రియ ఇంకా జరగలేదు. అధికారంలో ఉన్న పార్టీ తనకు ప్రయోజనం కలిగించేలా చేసుకోవడం సాధారణ ప్రక్రియే. కాంగ్రెస్ కూడా అదే ధోరణిలో వెళ్లడం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా పనిచేయాలనే తపన ఉన్నవారికి అవకాశం కల్పించడం లేదని కొందరు సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు.
 మూడో విడత రచ్చబండ సందర్భంగా లబ్ధిదారులకు పూర్తిగా అధికార పార్టీ రంగు వేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రానున్న మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త తీసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు ‘స్థానిక’ లబ్ధిచేకూర్చేలా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా మూడో విడత రచ్చబండ లబ్ధిదారులకంటే అధికార పార్టీ నేతలకు లబ్ధిచేకూరేలా ఉందన్న విమర్శల మధ్యన సోమవారం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంపై అందరు దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement