కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రచ్చబండ కార్యక్రమం గుదిబండగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 11 నుంచి 26 వరకు నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండలో స్వీకరించిన అర్జీలు పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు. ఈ సారైనా మోక్షం లభిస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో నివేదించిన సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో ప్రజలు అధికారులను నిలదీసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి రెండు విడతలుగా నిర్వహించిన కార్యక్రమాల వివరాలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? రేషన్‌కార్డులు, పింఛన్లు, అభయహస్తం, హౌసింగ్, ఉపాధి హామీ, పావలవడ్డి, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల అమలు తీరుపై ఏవైనా సమస్యలు ఉంటే అర్జీలను స్వీకరించనున్నారు.
గత రచ్చబండ వివరాలు..
జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని 866 గ్రామ పంచాయతీలతోపాటు ఏడు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్నారు. జిల్లాలో మొదటి విడత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం 58,434 మంది దరఖాస్తులు రాగా, ఇందులో 40,440 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛన్ కోసం 45,482 అర్జీలు రాగా 32,609 మందిని, ఇళ్ల కోసం 1.06 లక్షల అర్జీలు రాగా, 64,578 మందిని అర్హులుగా గుర్తించారు. పావలావడ్డీ రుణాల కోసం 4,404 దరఖాస్తులు, అభయహస్తంకు 2,174, ఉపాధిహామీ పథకం కోసం 10,085, ఆరోగ్యశ్రీ కోసం 9,835 అర్జీలను అధికారులు స్వీకరించారు. మొదటి విడతలో 2.36 లక్షల అర్జీలు రాగా, 1,47 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేశారు. మిగతావారిని అనర్హులుగా గుర్తించినట్లు అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తోంది.
రెండో విడతలో జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల కోసం 29,643 దరఖాస్తులు, పింఛన్ల కోసం 15,522, ఇళ్ల కోసం 19,100 దరఖాస్తులు వచ్చాయి. అర్హులకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఎంత మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు? ఎంతమందిని అనర్హులుగా గుర్తించారనే వివరాలు మండల స్థాయి అధికారుల వద్దే ఉన్నాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మొదటి రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ వారిగా నిర్వహించి లబ్ధిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. రెండో విడత రచ్చబండ కార్యక్రమం మండల స్థాయి కేంద్రాల్లో నిర్వహించారు. దీంతో చాలా మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమం కూడా మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
సమస్యలు పరిష్కారమయ్యేనా..?
జిల్లాలో జనవరి 24, 2011 నుంచి ఫిబ్రవరి 12, 2011 వరకు మొదటి విడత, నవంబర్ 2, 2011 నుంచి 30 నవంబర్ 2011 వరకు రెండో విడత రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో స్వీకరించిన అర్జీలు పరిష్కారానికి పూర్తిస్థాయిలో నోచుకోలేదు. ఫలితంగా అప్పట్లోనే ప్రజాపథం నిర్వహించి అర్జీలు స్వీకరించినా సమస్యలు పట్టించుకోలేదు. తాజాగా మూడో విడత రచ్చబండ కార్యక్రమం అంటూ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో, వార్డుల్లోకి వెళ్లనుంది. రెండు విడతల్లో నిర్వహించిన రచ్చబండలో దరఖాస్తులు చేసుకొని కార్యాలయాల చుట్టూ తిరిగి లబ్ధిరులు చివరకు వదిలేశారు. రచ్చబండ ద్వారా కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు, బిల్లులు అంటూ ప్రజల ముందుకు వస్తోంది. అయితే కొత్త సమస్యల కోసం ప్రజల వద్దకు వెళ్లేందుకు అధికారులు జంకుతున్నారు.
నేడు వీడియో కాన్ఫరెన్స్..
మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహణపై జిల్లాస్థాయి అధికారులతో బుధవారం ఉదయం 11 గంటలకు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమంపై ఆయన అధికారులకు సూచించనున్నారు.