నూతన ఓటరుకు నిరాశ | Polling Stations Nearly Empty | Sakshi
Sakshi News home page

నూతన ఓటరుకు నిరాశ

Published Mon, Dec 9 2013 3:31 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Polling Stations Nearly Empty

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. దాంతో ఓటరుగా నమోదు చేసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఆతృతగా వెళ్లిన నూతన ఓటర్లకు నిరాశ మిగిలింది. కొంతమంది ఓటరు నమోదు ఫారాలతో, మరికొంతమంది ఆధారాలతో అక్కడకు వెళ్లి ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో వారికి భంగపాటు ఎదురైంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటుహక్కు బదిలీ చేసుకునేవారు, ఓటర్ల నమోదులో తప్పులు దొర్లినవారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి బూత్ లెవల్ ఆఫీసర్లను వెతుక్కోవలసిన దుస్థితి నెలకొంది.
 
 ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఆదివారాలపాటు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత ఆదివారం మొక్కుబడిగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఆదివారం కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వారాలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఇబ్బందిపడిన ప్రజలు వచ్చే ఆదివారం జరగనున్న కార్యక్రమంపై పెదవి విరుస్తున్నారు. అప్పుడు కూడా తమకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో ప్రస్తుతం 2751 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 22 లక్షల 5వేల 692 మంది ఓటర్లున్నట్లు ఇటీవల ప్రకటించిన ఓటర్ల ముసాయిదాలో లెక్కలు తేల్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ ఈడు యువత ఎక్కువగానే ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం ఓటు హక్కు పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే జిల్లాలోని బూత్ లెవల్ ఆఫీసర్లు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా ‘న్యూస్‌లైన్’ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
 
 ఒం‘గోలు’ తప్పింది:
 ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియ లక్ష్యం తప్పినట్లయింది. గత ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాలు ఖాళీగానే కనిపించాయి. దాని ప్రభావం తాజాగా జరిగిన కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 251 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో మూడొంతుల్లో బూత్ లెవల్ ఆఫీసర్లున్నారు. ఒక వంతు పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఒంగోలు నగరంలో కొంతమేర బూత్  లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నా, ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలాల్లో ఎక్కువశాతం ఖాళీగానే ఉన్నాయి. పైగా కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు, ఇతర ప్రాంతాలకు బదిలీ, తప్పు ఒప్పులకు సంబంధించిన ఫారాలు అందుబాటులో లేవు. దాంతో ఓటరుగా నమోదు చేయించుకునేందుకు వచ్చినవారు బూత్ లెవల్ ఆఫీసర్ల వద్ద ఉన్న ఫారాన్ని జిరాక్స్ తీసుకొని నింపాల్సిన దుస్థితి నెలకొంది.


 కందుకూరులో ఎక్కువ కేంద్రాలు ‘ఖాళీ’
 కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 220 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. వలేటివారిపాలెంలో 36 పోలింగ్ కేంద్రాలుంటే ఒక్కటి కూడా తెరుచుకోలేదు. లింగసముద్రం మండలంలో 35 పోలింగ్ కేంద్రాలుంటే మొత్తం మూతపడే ఉన్నాయి. గుడ్లూరులో 38 పోలింగ్ కేంద్రాలుంటే సగానికిపైగా తలుపులు తెరుచుకోలేదు. ఉలవపాడులో 40 పోలింగ్ కేంద్రాలకుగాను సగానికిపైగా ఖాళీగా కనిపించాయి. పోలింగ్ కేంద్రాలు ఖాళీగా ఉండటానికి కారణం వాటి కోసం నియమించిన బూత్ లెవల్ ఆఫీసర్లు తమ ఇళ్లవద్దనే కూర్చొని వచ్చిన వారికి నమోదు ప్రక్రియ చేపట్టి మమ అనిపించేశారు.
 
 కనిగిరిలో...
 కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓటర్ల నమోదుకు నలభై శాతం బూత్ లెవల్ ఆఫీసర్లు డుమ్మా కొట్టారు. కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, హనుమంతునిపాడు, పీసీపల్లి, వెలిగండ్ల మండలాల్లో ఓటర్లు బూత్ లెవల్ ఆఫీసర్ల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది బూత్ లెవల్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండానే ఇళ్ల వద్ద, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద కూర్చొని మొక్కుబడిగా ముగించేశారు.
 
 సంతనూతలపాడులో...
 సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో 228 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే వీటిలో కూడా ఎక్కువ పోలింగ్ కేంద్రాల తలుపులు తెరుచుకోలేదు. సంతనూతలపాడులోని మండల అధికారుల నిర్వాకం ఓటర్లకు సమస్యలు తెచ్చి పెట్టాయి. బూత్ లెవల్ ఆఫీసర్లుగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల్లో ఎక్కువ మందిని అక్కడి మండల విద్యాశాఖాధికారి అక్షర విజయం సమావేశం కోసం కూర్చోపెట్టారు.  తహసీల్దార్ కొంతమంది గ్రామ రెవెన్యూ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు.
 
 అద్దంకిలో...
 అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో 249 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదుకు అడ్డంకి ఏర్పడింది. పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది తమకు ఓటు హక్కు పొందే భాగ్యం లేదంటూ వారిని వారే నిందించుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు.
 
 చీరాలలో..
 చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో 198 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే అక్కడ కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలకు తాళాలు తెరుచుకోలేదు. ఓటర్ల నమోదుకు వచ్చినవారు, మార్పులు చేర్పులు చేసుకునేందుకు వచ్చినవారు, ఇతర ప్రాంతాలకు ఓటు హక్కు బదిలీ చేయించుకోవాలనుకున్నవారు నిరాశతో వెనుదిరిగారు.
 
 మార్కాపురంలో...
 మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 216 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. అందుకు కారణం గతవారం జరిగిన నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు బూత్ లెవల్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడమే.
 
 = దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 240 పోలింగ్ కేంద్రాలున్నాయి. అక్కడ కూడా ఎక్కువ మంది బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో లేరు.
 = గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలున్నాయి. బేస్తవారపేట పోలింగ్ కేంద్రంలోని గరల్స్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని మిద్దెపై ఏర్పాటు చేయడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 = యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో 217 పోలింగ్ కేంద్రాలున్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాలు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో బూత్ లెవల్ ఆఫీసర్లు అయిన అంగన్‌వాడీ కార్యకర్తలు ఇళ్లవద్దనే ప్రక్రియ నిర్వహించారు.
 = కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎక్కువమంది బూత్ లెవల్ ఆఫీసర్లు తమ విధులకు డుమ్మా కొట్టారు. ఫారాలు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement