గోదాములో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు
సాక్షి. ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నీ కలిసొస్తే రెండు నెలల్లోనే ఎన్నికలు జరిగేందుకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసుకొనే పనిలో పడడం అందుకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే వివిధ నివేదికలను ప్రభుత్వానికి పంపారు. తాజాగా ప్రభుత్వం మండలాల్లో ఎంపీడీవో ఖాళీలను పెట్టుకొని ఎన్నికలను జరపలేమని..దీని కోసం ఖాళీల లెక్క తేల్చి వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా జోన్‌లో ఖాళీగా ఉన్న ఎంపీడీవో పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపీడీవో పోస్టుల వివరాలను ప్రభుత్వానికి పంపారు.
జిల్లాలో జూలై 6వ తేదీన జిల్లా పరిషత్, 4వ తేదీన మండల పరిషత్ కొలువుల గడువు తీరింది. అప్పటి నుంచి మండలాల్లో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. ఇప్పటికే పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఆయనే ఒంగోలు నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈవోగా సంయుక్త కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యత వహిస్తున్నారు. కీలకమైన పోస్టుల్లోనే అధికారులు లేరు. స్థానిక పాలన పూర్తిగా ఇన్‌చార్జులు, ప్రత్యేకాధికారుల పాలనలో ఉంది. దీని వల్ల స్థానిక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్న భావన నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి స్థానిక పాలన బలోపేతం చేసే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే వడివడిగా అడుగులు వేస్తోంది.
నివేదికలు ప్రభుత్వానికి..
జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు జెడ్పీటీసీలు, ఎంపీపీల ఎన్నిక కావాలి. మండలాల ప్రాదేశికాల పరిధిలో 792 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. పంచాయతీలు 1038 ఉన్నాయి. ఒంగోలు నగర పాలక సంస్ధతో పాటు చీరాల, కందుకూరు, మార్కాపురం మున్సిపాలిటీలు, కనిగిరి, అద్దంకి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. తాజాగా పోలింగ్ కేంద్రాల ప్రకటన చేశారు. స్థానిక సంస్థల పరిధిలో 21,65,680 ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 2726 ఉన్నాయి. వీటి వివరాలను ప్రభుత్వానికి పంపారు. గతంలో ఉన్న రిజర్వేషన్ల వివరాలను తాజాగా ప్రభుత్వం అడిగింది. రిజర్వేషన్ వివరాలను పంపారు. ఎన్నికలకు అవసరమయ్యే కసరత్తు తీరు చూస్తుంటే నవంబర్ లోగా ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ బాక్స్‌ల వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ పత్రాల వివరాలను తయారు చేశారు. మండలాలకు ఓటర్ల జాబితాలను పంపారు. పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ ఎన్నికలను కొద్ది తేడాతో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఎన్నికల కమిషన్ ఏ క్షణంలో స్థానిక ఎన్నికల షెడ్యూలును ప్రకటించినా అందుకు సిద్ధంగా ఉండమని ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు ఇప్పటికే వివిధ సందర్భాల్లో ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యం లోనే స్థానిక ఎన్నికలు రెండు నెలల్లోపే వచ్చే అ వకాశాలు ఉన్నాయని సంకేతాలు వస్తున్నాయి.
మిగిలింది రిజర్వేషన్ల ప్రక్రియ
జిల్లాలో మిగిలింది స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రమే. జూన్‌లో రిజర్వేషన్ల ప్రతిపాదనలను తయారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం 60 శాతంగా రిజర్వేషన్లు ఉన్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆలోపే ఉండాలని, అంతకన్నా తక్కువగానే ఉండాలన్న సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా చట్ట సవరణ చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు. చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ గానీ అసెంబ్లీలో సవరణ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత రిజర్వేషన్ల విధి విధానాలు ప్రకటన వెలువడుతుంది. దీనిని బట్టి ఒంగోలు, కందుకూరు, మార్కాపురం రెవెన్యూ డివిజన్ అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం కొద్ది రోజుల్లోనే పూర్తికానుందని పంచాయతీరాజ్ వర్గాలు చెబుతున్నాయి.
ఎంపీడీవో పోస్టుల భర్తీకి చర్యలు
జిల్లాలో ఎంపీడీవో పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో బల్లికురవ, యద్దనపూడి, సీఎస్‌పురం, చీరాల, జె.పంగులూరు, దొనకొండ, గుడ్లూరు, హనుమంతునిపాడు, కనిగిరి, కొనకనమిట్ల, మర్రిపూడి, ముండ్లమూరు, పామూరు, పీసీపల్లి, తాళ్లూరు, వెలిగండ్ల, వీవీపాలెం, అర్ధవీడు, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, పెద్దారవీడు, రాచర్ల, త్రిపురాంతకం మండలాల్లో ఎంపీడీవోల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరత ఉంది. ఈ వివరాలను సేకరించారు. త్వరలోనే వీటిని భర్తీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల విధులకు త్వరలోనే రాబోయే గ్రామ వలంటీర్ల సేవలను వినియోగించుకోనున్నారు.
తొలిసారి నోటా..
నన్ ఆఫ్ ది ఓటు తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోతుందని అధికారులు చెబుతున్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో నోటా గుర్తును ఉంచేలా చర్యలు తీసుకోవడానికి ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారని సమాచారం. ఇంత వరకు సార్వత్రిక ఎన్నికల్లో నోటా గుర్తు ఉంది. 2014 ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఈ గుర్తును ఉంచాలన్న కసరత్తు జరుగుతోంది. రాజకీయ పార్టీల గుర్తులకు సంబంధం లేకుండా జరగనున్న ఎన్నికల కోసం ఎన్నికల సంఘం విడుదల చేసిన గుర్తులతో వివిధ రకాల బ్యాలెట్ పత్రాలు ముద్రించనున్నారు. ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే అక్కడికి సరఫరా చేయడానికి వీలుగా రెండు గుర్తులు, ఒక నోటా గుర్తు ఉండేలా బ్యాలెట్ పత్రం ముద్రించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సర్పంచి ఎన్నికలకు గులాబీ రంగు పత్రం, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం ఎంపిక చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment