ఒంగోలు: ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. శనివారం జరిగిన ఛైర్మన్ అభ్యర్థి ఎన్నికలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ప్రకాశం జడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయక తప్పలేదు. టీడీపీ సభ్యులు సహకరించకపోవడంతోఛైర్మన్ ఎన్నికను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ విజయ్ కుమార్ ప్రకటించారు. టీడీపీ నేతలు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించి ఆందోళన దిగారు. టీడీపీ సభ్యులు సహకరించాలని కలెక్టర్ పలుమార్లు విన్నవించినా వారు సహకరించకపోవడంతో ఛైర్మన్ ఎన్నికను తాత్కాలికంగా నిలిపివేశారు. సమావేశ హాల్లో టీడీపీ సభ్యులు వీరంగ సృష్టించడంతో వైఎస్సార్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎలాగోలా ప్రలోభాలతో దక్కించుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ ఆద్యంతం యత్నించింది. శనివారం మధ్యాహ్నం ప్రకాశం కలెక్టర్ అధ్యక్షతన జడ్పీ ఛైర్పర్సన్ ఎన్నికకు సమావేశం ప్రారంభం కాగానే కొద్ది సేపటికే తెలుగుదేశం నాయకులు వీరంగం వేశారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ 31 మంది సభ్యులతో సృష్టమైన ఆధిక్యంలో ఉన్నా టీడీపీ నేతలు ఆందోళనతో అడ్డుకున్నారు. కేవలం 25 సభ్యుల సంఖ్యా బలం మాత్రమే ఉన్న టీడీపీ ముగ్గురు వైఎస్సార్ సీపీ సభ్యుల్ని ప్రలోభాలకు గురి చేయాలని యత్నించింది. ప్రకాశం ఛైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ ఆద్యంతం యత్నించడంతో సమావేశం రసాభాసగా మారింది. వైఎస్సార్ సీపీ సభ్యులతో టీడీపీ వాగ్వివాదానికి రణరంగాన్ని తలపించారు. చివరి వరకూ ఇదే పరిస్థితి కొనసాగడంతో అభ్యర్థి ఎన్నికను వాయిదా వేశారు.