ఇంజనీరింగ్‌ సీట్లలో సగం ఖాళీ | Poor students stopping their study that who are unable to pay fees | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ సీట్లలో సగం ఖాళీ

Published Mon, Jul 9 2018 2:23 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

Poor students stopping their study that who are unable to pay fees - Sakshi

సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం.. ఒకప్పుడు నిరుపేద విద్యార్థులకు ఎంతో అండగా నిలిచి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. మెడిసిన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఇలా ఏ ఉన్నత చదువు పూర్తిచేయాలన్నా వారికి ఆ పథకం తోడుగా నిలిచింది. కానీ నేడు ఆ పథకాన్ని నీరుగార్చేశారు. పేదలకు ఉన్నత చదువుల్ని దూరం చేశారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌ కోర్సులకు ఫీజులు భారీగా పెరిగిపోయాయి. ఆర్థిక స్థోమత లేక పేదలు ఈ కోర్సులకు దూరమవుతున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులకన్నా టెక్నికల్‌ కోర్సులు చదివితే తొందరగా ఉద్యోగమో, ఉపాధో దొరుకుతుందని విద్యార్థులు చాలాకాలంగా ఇంజనీరింగ్‌ వైపు ఎక్కువగా దృష్టి పెట్టేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం వారికి వెన్నుదన్నుగా నిలిచింది. అప్పట్లో ఎవరు ఏ కోర్సు చేయాలనుకున్నా ఆయా కోర్సుల ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించేది. దీంతో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు బారులు తీరేవారు. కాలక్రమేణా ఆ పథకాన్ని నీరుగార్చడంతో విద్యార్థులు లేక కాలేజీలే మూతపడుతున్నాయి.  

ఫీజుల పెంపుతో విద్యార్థులపై భారం 
ఎంసెట్‌లో పదివేలలోపు ర్యాంకు సాధించిన వారికి మాత్రమే ఆయా కోర్సుల పూర్తిఫీజును  రీయింబర్స్‌ చేసేలా ప్రభుత్వం నిబంధనలను మార్చింది. పదివేలు దాటి ర్యాంక్‌ వస్తే వారికి రూ. 35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంటు ఇస్తున్నారు. తక్కిన ఫీజు ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. ఇంజనీరింగ్‌లో నాలుగేళ్లపాటు ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో లేక తమ పిల్లలను కాలేజీల్లో చేర్చలేకపోతున్నారు. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచేయడం కూడా విద్యార్థులను సాంకేతిక విద్యకు దూరం చేస్తోంది. గతంలో రూ. 75 వేల లోపు వరకు గరిష్ట ఫీజు ఉండగా ఇప్పుడు దానిని రూ. 1.10 లక్షలకు పెంచారు. అంటే ప్రభుత్వం రూ. 35 వేలు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తే విద్యార్థి 75 వేలు చెల్లించాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల సంఖ్య 406 వరకు ఉంది.

ఇందులో అత్యధిక కాలేజీల్లో రూ. 50 వేల నుంచి రూ. 60 వేల లోపు ఫీజు ఉండేది. గరిష్ట ఫీజు రూ.75 వేల వరకు ఉన్న కాలేజీల కొన్నే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఫీజులు పెంచడంతో రూ. 75 వేల నుంచి రూ. 95 వేల మధ్య ఫీజులున్న కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలేజీల్లో చేరే విద్యార్థులపై ఏటా రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకు భారం పడుతోంది. ఇక రూ. లక్షకు పైగా ఉన్న కాలేజీల్లో చేరాలంటే ఫీజుల భారం తట్టుకోలేక ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇతర కోర్సుల్లో చేర్పిస్తున్నారు. తాజాగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరికలే ఇందుకు తార్కాణం 

వేలాది సీట్లు ఖాళీ.. 
రాష్ట్రంలో 1.56 లక్షల ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు ఉంటే.. గత ఏడాదిలో 57 వేల సీట్లు మిగిలిపోయాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు జరిగిన ఎంసెట్‌కు  2,64,295 మంది హాజరుకాగా వారిలో 2,01,900 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఎంపీసీ 1,38,017 మంది, బైపీసీ 63,883 మంది ఉన్నారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటా సీట్లు 95,455 ఉండగా 67,078 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలోనూ ఆప్షన్లు ఇచ్చింది 65,909 మంది కాగా సీట్లు పొందింది 60,943 మంది. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలోనూ 15 వేల మందికి పైగా కాలేజీల్లో చేరలేదు. ఇక రెండో విడత కౌన్సెలింగ్‌కు 47,526 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా కౌన్సెలింగ్‌కు వచ్చిన వారి సంఖ్య కేవలం 3,165 మంది మాత్రమే. రెండో విడత కౌన్సెలింగ్‌ ముగిసేసరికి ఇంకా ఎంపీసీ స్ట్రీమ్‌లో 33 వేల సీట్లు మిగిలి ఉన్నాయి. బైపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌ ఇంకా జరగాల్సి ఉంది. అందులోనూ భారీగానే సీట్లు మిగిలిపోతాయని భావిస్తున్నారు. అందులో ఫార్మా కోర్సుకు సంబంధించినవి కావడం, ఫీజులు ఎక్కువగా ఉండడంతో పాటు పెద్దగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఫీజులు చెల్లించి చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.  

ముఖ్య బ్రాంచిల్లోనూ మిగిలిపోతున్న సీట్లు 
ఇంజనీరింగ్‌లో ముఖ్యమైన బ్రాంచిలుగా భావించే వాటిలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. గతేడాది ఈసీఈలో 5,280, కంప్యూటర్‌ సైన్సులో 4,289, కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 6,985, ఈఈఈలో 5,561, సివిల్‌లో 5,366 సీట్లు మిగిలిపోయాయి. ఫార్మసీలో 3,587 సీట్లుంటే అందులో కేవలం 298 మాత్రమే భర్తీ అయి 3,289 సీట్లు మిగిలిపోయాయి. ఇక గత ఏడాదిలో ఒక్క విద్యార్థీ చేరని కాలేజీలు 5 ఉన్నాయి. కేటాయించిన విద్యార్థుల సంఖ్య ప్రకారం 1–5 మంది విద్యార్థులు ఉన్నవి 14, 6–10 మంది ఉన్నవి 9, 11–15 వరకు ఉన్నవి 9, 16–20 వరకు ఉన్నవి 3, 21 నుంచి 25 వరకు ఉన్నవి 8 మాత్రమే. ఈ ఏడాది కూడా 1–5 మంది ఉన్నవి 5, 6–10 మంది ఉన్నవి 6, 11–15 మంది ఉన్నవి 4, 16–20 మంది ఉన్నవి 8, 21– 25 మంది ఉన్నవి 10 కాలేజీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని కాలేజీలు విద్యార్థులు చేరని కోర్సులను రద్దుచేసుకుంటుండగా మరికొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా మూతకు దరఖాస్తు చేస్తున్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కాలేజీలు 46 కోర్సులను రద్దుచేసుకున్నాయి. 9 కాలేజీలు మూతపడ్డాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement