సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఫైలిన్ తుపాను ప్రభావం కనిపించింది. గురువారం మధ్యాహ్నం నెల్లూరు నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక జిల్లావ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి మబ్బులు కమ్మి పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా, మిగిలిన చోట్ల చిరుజల్లులు పడ్డాయి. శుక్రవారం నాటికి తుపాను ప్రభావం అధికంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి కలెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలో తీరప్రాంత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కృష్ణపట్నం ఓడరేవులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లిన వారు తక్షణం తిరిగి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొంది. తుపాను తీవ్ర రూపం దాల్చే పరిస్థితిలో లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సమ్మెలో ఉన్న అధికారులందరినీ విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు.
తీరం.. అప్రమత్తం
బిట్రగుంట, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెనుతుపాన్‌గా మారే ప్రమాదం ఉందనే అధికారిక హెచ్చరికల నేపథ్యంలో తూర్పుతీరం అప్రమత్తమైంది. విపత్తుల సమయంలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ ఉద్యోగులు సహా వివిధ విభాగాలు సమైక్య సమ్మెలో ఉండటంతో తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు, కాపులే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు తీరంలోనూ వాతావరణ పరిస్థితి క్రమంగా అల్లకల్లోలంగా మారుతుంది. ‘ఫైలిన్’ పెనుతుపాన్ హెచ్చరికలు చేసిన కొద్ది గంటలకే తీరం వెంట సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం నుంచి వాతావరణంలో అనూహ్యంగా మార్పులు ఏర్పడి సముద్రంలో అలల ఉధృతి అధికమైంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలతో తీరం అల్లకల్లోలంగా ఉంది. తాటిచెట్లపాళెం వద్ద సముద్రం కొంత మేర ముందుకు దూసుకువచ్చింది. అలల ఉధృతికి తోడు భారీ జల్లులు పడుతుండటంతో పడవలు, వలలను తీరానికి దూరంగా తరలించి భద్రపరచుకునేందుకు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోరువానలో తడుస్తూనే వలలు, పడవలను తీరానికి దూరంగా తరలించారు. ఈదురు గాలులకు తోడు పెద్దపెద్ద శబ్దాలతో అలలు విరుచుకుపడుతుండటంతో గంగపుత్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుపాన్ భయంతో తీరప్రాంత గ్రామాలైన బంగారుపాళెం, కొత్తబంగారు పాళెం, పాతబంగారు పాళెం, అలిచెర్లబంగారుపాళెం, తాటిచెట్లపాళెం, కడపాళెం, కొత్తకడపాళెం, టెంకాయచెట్లపాళెం చెందిన మత్స్యకారులు హడలిపోతున్నారు.
సమైక్య రైతు దీక్ష
ఆనం రామనారాయణరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో జేఏసీ నాయకులు ప్రజాకోర్టు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధనరెడ్డి నాయకత్వంలో రైతు దీక్షలు జరిగాయి. గూడూరులో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద జేఏసీ నాయకులు రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అపర భగీరథుడని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. గూడూరు రూరల్ మండలం తిప్పవరప్పాడు క్రాస్‌రోడ్డు వద్ద రైతు దీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, మండల, పట్టణ కన్వీనర్లు మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, నాశిన నాగులు, నాయకులు రాధాకృష్ణారెడ్డి, రాజే శ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంటలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో సమైక్య రైతు దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య సంఘీభావం తెలిపారు.
వాకాడులో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల రైతులు గురువారం రైతు దీక్ష చేపట్టారు. సైదాపురం, రాపూరు, వెంకటగిరిలో జరిగిన రైతు దీక్షల్లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్‌లో నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహించారు. నాయుడుపేటలో మరో సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి రైతుదీక్షను చేపట్టారు. సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో తడ, ఓజిలి మండలాల్లో రైతుదీక్ష చేశారు. పెళ్లకూరు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లో జరిగిన దీక్షల్లో కూడా ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆత్మకూరులో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు.కావలిలో గాంధీబొమ్మ సెంటర్‌లో నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్షలు ప్రారంభమయ్యాయి.
పొంచి ఉన్న ఫైలిన్
Published Fri, Oct 11 2013 5:56 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement