- నామినేటెడ్ కోసం తమ్ముళ్ల ఆరాటం
- చక్రం తిప్పుతున్న పుత్రరత్నాలు
- పోస్టుకో రేటు..భారీగా వసూళ్లు
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షంలో ఉండగా పదేళ్లపాటు పార్టీ జెండా మోసి..గడిచిన ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రేయింబవళ్లు శ్రమించిన సీనియర్లకు సంక్రాంతిలోగా నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. కానీ ఎన్నికల్లో చేసిన ఖర్చులో కాసింతైయినా ఈ పదవుల కేటాయింపు ద్వారా భర్తీ చేసుకోవాలని ఆలోచనతో జిల్లా నాయకత్వం చేస్తున్న జాప్యం పట్ల పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యం గా జిల్లా పార్టీలో చక్రం తిప్పుతున్న ప్రభుత్వ ‘పెద్దల’ కుటుంబ సభ్యులు ఈ పదవుల పందేరానికి కలెక్షన్ ఏజెంట్లుగా అవతారమెత్తి అందినకాడకి దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
అధినేతే స్వయంగా ఆదేశించడంతో సంక్రాంతిలోగానే నామినేటెడ్ పదవుల పందారం కొలిక్కివస్తుందని పార్టీ శ్రేణులు కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షించారు. కానీ జిల్లా ప్రజా ప్రతినిధులు వారి ఆశలపై
నీళ్లు చల్లారు. ఎడముఖం..పెడముఖంగా ఉన్న ప్రభుత్వ పెద్దలిద్దరూ ఎవరికి వారు జాబితాలు సిద్ధం చేశారు. సొంత నియోజకవర్గాలకు పరిమితం కాకుండా తమ వెంట తిరిగే ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలోని పదవులకు కూడా తమ పెత్తనమే సాగేలా చక్రం తిప్పారు.
దీంతో ఆశావహులంతా తమ ప్రజాప్రతినిధుల ద్వారా వీర్ని ప్రసన్నం చేసుకునేందుకు మూడు నెలలుగా చెప్పులరిగేలా తిరిగారు. తీరా సమయం వచ్చేసరికి మా అబ్బాయిని కలవండి..మా ఆవిడిని కలవండంటూ వారికి సంకేతాలివ్వడంతో చేసేది లేక వార్ని కూడా కలుస్తూ ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. యువనేతలైతే ఏకంగా హుండీలు పెట్టేసి పదవికింత అని వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు పార్టీలోనే బలంగా వినిపిస్తున్నాయి.
సింహాచలం దేవస్థానం ట్రస్టీ పదవుల నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవుల వరకు పోస్టుకో రేటు చొప్పున వసూలు చేస్తున్నట్టుగా పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఏకంగా రూ.15 లక్షల వరకు చేతులుమారినట్టుగా పార్టీలో చర్చసాగుతోంది. ఇదే రీతిలో మిగిలిన మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవుల ద్వారా తమ గళ్లాపెట్టె నింపుకునేందుకు ఈ ప్రభుత్వ పెద్దల కుటుంబ సభ్యులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
పోటీ ఎక్కువగా ఉన్న పదవులకైతే ఏకంగా వేలం పాటలు సైతం పెట్టినట్టుగా వినికిడి. ఈ విధంగా దాదాపు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులన్నింటికి రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చేతులు మారినట్టుగా పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. సింహాచలం దేవస్థానం మినహా ఇతర పేరొందిన దేవస్థానాల పాలక మండళ్ల విషయంలో ఇదే రీతిలో కలెక్షన్స్ సాగిస్తున్నట్టుగా చెబుతున్నారు.
రాష్ర్టస్థాయి పదవుల భర్తీ కోసం పార్టీ యువనేత రాజధానిలో హుండీపెడితే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లా స్థాయి పదవుల పందారం కోసం ఇక్కడి యువనేతలు స్థానికంగా హుండీలు పెట్టి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలాగైతే పదేళ్ల పాటు పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని అప్పుల పాలై పోయిన మాబోటి వాళ్ల పరిస్థితి ఏమిటని పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
నిన్నమొన్నటి వరకు నామినేటెడ్ పదవులు మీవే అంటూ ఊరించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు తమతో పాటు వలస వచ్చిన..ఎన్నికలనంతరం తమతో అంటకాగే వారికి పదవులు కట్టెబెట్టేందుకు వీరు సిద్ధమవుతుండడం పట్ల పార్టీ సీనియర్లు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు.