తపాలా శాఖ రెండు ముక్కలు
విభజన కసరత్తు షురూ
ఏడెనిమిది నెలల్లో ‘తెలంగాణ సర్కిల్’ ఏర్పాటు
ప్రస్తుత ఏపీ సర్కిల్ ఆంధ్రకు పరిమితం
విజయవాడ రీజియన్ నుంచి విడిపోనున్న ఖమ్మం పోస్టు
రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్స్
58:42 నిష్పత్తిలో సిబ్బంది కేటాయింపు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకుz. రాష్ట్రం విడిపోయినా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను విడగొట్టాల్సిన అవసరం లేదని తొలుత భావించిన కేంద్రం క్రమంగా మనసు మార్చుకుంది. రాజకీయ ఒత్తిడి పెరగడంతో వాటిని కూడా విభజించాలని నిర్ణయించింది. పైగా రెండు రాష్ట్రాలకు ఒకే చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ఉంటే ఇబ్బంది తలెత్తుతుందన్న కారణంతోనూ తపాలా శాఖ విభజనకు కేంద్రం మొగ్గుచూపింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేను విభజించేందుకు కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే దారిలో తపాలా శాఖను కూడా ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్‌గా రెండు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న తపాలా శాఖ మరో ఏడెనిమిది నెలల్లో రెండు సర్కిళ్లుగా మారబోతోంది. సేవలపరంగా ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపకున్నా.. అంతర్గతంగా తపాలా శాఖలో భారీ మార్పుచేర్పులు చోటుచేసుకోబోతున్నాయి.ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్‌గా ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి సుధాకర్ వ్యవహరిస్తున్నారు. ఇక ముందు ఇలాంటి మరో పోస్టును సృష్టించి ఆ ర్యాంకు అధికారిని కేంద్రం కేటాయిస్తుంది.
తెలంగాణలో ప్రస్తుతం రెండు రీజియన్లున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ సిటీ రీజియన్, మిగతా తెలంగాణ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ రీజియన్ ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 13 తపాలా డివిజన్లున్నాయి. కొత్తగా తెలంగాణ సర్కిల్ ఏర్పడితే ఈ రీజియన్లను మూడుగా విభజించే అవకాశం ఉంది. ప్రస్తుత ఏపీ సర్కిల్‌ను ఆంధ్రపదేశ్‌కు కేటాయిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్టణం, కర్నూలు రీజియన్లున్నాయి. వీటి పరిధిలో 36 తపాలా డివిజన్లున్నాయి.
హైదరాబాద్ ఆబిడ్స్‌లో ప్రస్తుతమున్న జనరల్ పోస్టాఫీసు(జీపీఓ) తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనూ కొత్తగా ప్రధాన తపాలా కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుబంధంగా అక్కడే చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్రమే నిధులు సమకూరుస్తుంది.
ప్రస్తుత ఏపీ సర్కిల్ పరిధిలో 16 వేల సాధారణ పోస్టాఫీసులు, 2,500 డిపార్ట్‌మెంటల్ పోస్టాఫీసులున్నాయి. తెలంగాణలో ఇవి 8,500 ఉన్నాయి. విభజన తర్వాత ఏ ప్రాంతంలోవి ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ప్రసుతం విజయవాడ సర్కిల్ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లాను తెలంగాణ పరిధిలోకి మార్చుతారు. దీంతో తెలంగాణ పోస్టాఫీసుల సంఖ్య కొంత పెరుగుతుంది. ఏపీ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 45 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని 58:42 నిష్పత్తిలో విభజిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మెయిల్ మోటారు సర్వీసు(ఎంఎంఎస్) తరహా వ్యవస్థలను ఆంధ్రా ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిధి విస్తృతంగా ఉన్నందున సేవలపరంగా తపాలా శాఖలో కొన్ని లోపాలు తలెత్తుతున్నాయి. విభజనతో పరిధి తగ్గి సేవలు మెరుగుపడే అవకాశముంది. అలాగే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కూడా పెరగనున్నాయి. రెండు సర్కిళ్లకు విడివిడిగా నిధులు దక్కుతాయి.