ముందు జవాబు చెప్పి మాట్లాడండి
- కాంగ్రెస్ నేతలకు వెంకయ్యనాయుడు సూచన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టే కాంగ్రెస్ నేతలు.. ముందు విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామన్న అంశాన్ని ఎందుకు పెట్టలేదో చెప్పాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. దీనికి జవాబు చెప్పిన తరువాత మాట్లాడాలని సూచించారు. సహచర కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, సుధీష్ రాంబొట్లతో కలిసి ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా అంశంలో జైరాం రమేష్, ఇతర కాంగ్రెస్ నేతలు వెంకయ్యపె ఆరోపణలు చేస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ముంపు మండలాలను కలిపే అంశానికి సంబంధించి ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయలేదో, ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పెట్టలేదో చెప్పి తరువాత ఈ విషయాలపై తమ గురించి మాట్లాడాలని చెప్పారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో తాను పట్టుబట్టిన మాట వాస్తవమేనని, అది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు.
భూసేకరణ చట్టం ఆర్డినెన్స్, దేశంలో పలు ప్రాంతాల్లో చర్చిలపై దాడులు, మత మార్పిడులపై కాంగ్రెస్‌తో సహా పలు ప్రత్యర్థి పార్టీలు కేంద్రంలోని తమ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నాయని వెంకయ్య ఆరోపించారు. దేశంలో అభివృద్ధి జరగకూడదని వారు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ దుష్పప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టి, వాస్తవాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు చెప్పారు. ప్రత్యర్థులు ఎంత స్థాయిలో అసత్య ప్రచారానికి పూనుకున్నా ప్రజల్లో ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని తెలిపారు.
ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి: కి షన్‌రెడ్డి
సూర్యాపేట ఎన్‌కౌంటర్‌పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందజేయకపోవడమే ఈ ఘటనకు కారణమన్నారు.
వెంకయ్యకు బీసీ నేతల వినతి
దేశంలో 56 శాతం వరకూ ఉన్న బీసీలకు చట్ట సభల్లో 15 శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్‌ను కల్పించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు బీసీ నేతలు విన్నవించారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో వెంకయ్యను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నేతలు కలిశారు.