ఆదిదంపతుల జలవిహారం..వర్ణింపతరమా | Potettina devotees Indrakiladri | Sakshi
Sakshi News home page

ఆదిదంపతుల జలవిహారం..వర్ణింపతరమా

Published Mon, Oct 14 2013 1:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

Potettina devotees Indrakiladri

 

=   నేత్రపర్వంగా తెప్పోత్సవం
 =   భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి
=     పెద్దసంఖ్యలో తరలివచ్చిన భవానీలు
=     సోమవారం కూడా రద్దీ ఉండే అవకాశం

 
సాక్షి, విజయవాడ : గంగాసమేత దుర్గామల్లేశ్వరస్వామివార్ల జలవిహారం జనహారంగా సాగింది. దసరా ఉత్సవాల ముగింపు రోజైన ఆదివారం సాయంత్రం కృష్ణమ్మ ఒడిలో హంసవాహనంపై విశ్వేశ్వరి ముమ్మార్లు విహరించింది. వేలాదిమంది భక్తులు ఈ తెప్పోత్సవాన్ని వీక్షించి తరించారు. తొలుత ఇంద్రకీలాద్రి నుంచి ఊరేగింపుగా గంగాదేవి, దుర్గాదేవి, మల్లిఖార్జునస్వామి వార్లు ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకూ అర్చకులు తీసుకువచ్చారు.

ఘాట్‌లో రంగురంగుల విద్యుత్తు దీపకాంతులు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి సిద్ధంగా ఉన్న హంసవాహనంపై అధిష్టించి త్రిలోక సంచారిణి జలవిహారం చేశారు. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా పేలుళ్లు మధ్య సాగిన అమ్మవారి నౌకా విహార కార్యక్రమాన్ని వీక్షించడానికి రెండు కళ్లు చాలలేదు. తెప్పోత్సవం సాగినంతసేపు దుర్గాఘాట్‌లో జై భవానీ అంటూ భక్తులు జైజై ధ్వానాలు చేశారు. బ్యారేజీ, అశోకస్తంభం పరిసరాలన్నీ జనంతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్‌కలెక్టర్ హరిచందన, పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
తరలివచ్చిన భవానీలు

 విజయదశమి రోజున దుర్గమ్మ శాంతిమూర్తిగా రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మను దర్శించి తరించేందుకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. ఎర్రని దుస్తులు ధరించి నలభైరోజులు పాటు దీక్ష పాటించిన భవానీలు అమ్మవారి సన్నిధికి చేరుకుని దీక్ష విరమించడం ఆనవాయితీ.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భవానీలు ఆదివారం దుర్గగుడికి రావడంతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. ఈ భక్తులు కృష్ణానదిలో పవిత్రస్నానాలు చేసి తడిబట్టతోనే గంటలు తరబడి క్యూలలో నిలబడి అమ్మవార్ని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచి అర్ధరాత్రి రాటే వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తొమ్మిది రోజులు పాటు సాగిన దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో జరిగిన పూర్ణాహుతితో ముగిశాయి.

 టీటీడీ నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు

 వెంకటేశ్వరస్వామి సోదరిగా దుర్గమ్మకు టీటీడీ ఏఈఓ రామూర్తి రెడ్డి, అర్చకుడు గోపాలాచార్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే టీటీడీ అధికారులకు తీవ్ర అవమానం జరిగింది. టీటీడీ నుంచి పట్టువస్త్రాలను తీసుకువచ్చిన అధికారుల్ని అంతరాలయ దర్శనం చేయించకుండా కేవలం లఘుదర్శనానికే పరిమితం చేయడం పలు విమర్శలకు దారితీసింది.

 సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బంది

 ఉత్సవాలకు ప్రారంభానికి ముందు, తరువాత అధికారులు ఎన్ని సమావేశాలు నిర్వహించినా చివరకు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఆదివారం ఉదయం వరకు విధులు నిర్వహించిన దేవస్థానం సిబ్బంది సాయంత్రం కొండపై కనపడలేదు. దుర్గాఘాట్‌లో తెప్పోత్సవం జరుగుతూ ఉండటంతో అంతా అక్కడకు చేరుకున్నారు. దీంతో క్యూలలో నిలబడిన భక్తులు నానా అవస్థలు పడ్డారు. వినాయకుడు గుడి వద్ద క్యూలలో నిలబడిన భక్తులకు మంచినీళ్ల ప్యాకెట్లు ఇచ్చే నాథుడే కరువయ్యారు.

స్నానఘట్టాల్లో పదుల సంఖ్యలో క్షురకుల్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అయితే ఒకేసారి వేలాది మంది భక్తులు తరలిరావడంలో తలనీలాలు సమర్పించడంలో సమస్య తలెత్తింది. దీంతో రాజీవ్ పార్కు, పండిట్ నెహ్రు బస్‌స్టేషన్, దుర్గాఘాట్ బయట ప్రైవేటు క్షురకుల వద్దనే భక్తులు తలనీలాలను సమర్పించి, నదీ స్నానం ఆచరించారు. నదిలో స్నానాలు చేసి వచ్చిన మహిళలు చీరలు మార్చుకునేందుకు గదులు సరిపోకపోవడంతో ఇబ్బంది పడ్డారు.

 కొనసాగుతున్న రద్దీ

 దసరా ఉత్సవాలు పూర్తయినప్పటికీ ఇంద్రకీలాద్రిపై రద్దీ మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వం సోమవారం విజయదశమి అని ప్రకటించడంతో సోమవారం కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బుధవారం వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఉన్నతాధికారుల నిఘా లేకపోవడంతో దేవస్థానం అధికారులు భవానీభక్తులకు ఏ మేరకు ఇబ్బందిలేకుండా చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
 రైల్వేస్టేషన్‌లో భవానీల రద్దీ


 శరన్నవరాత్రుల్లో చివరి రోజు అయిన ఆదివారం దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భవానీలతో విజయవాడ రైల్వేస్టేషన్ నిండిపోరుుంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భవానీలు నగరానికి చేరుకున్నారు. ఉదయం రాయగడ్, విశాఖపట్నం-విజయవాడ పాసింజర్లతో పాటు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భవానీలు ఎక్కువగా వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement