కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనను అన్నివర్గాలు వ్యతిరేకించాయి. రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. పెద్దలను వదిలి పేదలపై చార్జీల భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై కరీంనగర్‌లోని జెడ్పీ హాలులో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) గురువారం బహిరంగ విచారణ చేపట్టింది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ప్రజలు, నాయకులు హాజరయ్యారు. పోలీస్ పహారాలో విచారణతో సాధారణ ప్రజలు రాలేకపోయారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 20 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. - కరీంనగర్, సాక్షి
నాణ్యమైన విద్యుత్ అందించాలి
గృహ వినియోగదారులపై పైసా కూడా చార్జి పెంచొ ద్దు. సంస్థ అసమర్థతతో వస్తున్న నష్టాలను వినియోగదారులపై ఎలా వేస్తారు. విద్యుత్ లైన్ లాస్‌ను తగ్గిం చి చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలి.
- శ్రీనివాస్, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రతినిధి
సిబ్బంది లేక ప్రమాదాలు
విద్యుత్ సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యుత్ పోయిందని, ఫీజ్ కొట్టేసిందని సమాచారం అందించినా అధికారులు స్పందించడం లేదు. షాక్‌తో చనిపోతే, పరిహారం, ఉద్యోగం ఇవ్వడానికైనా ముందుకు వస్తున్న సంస్థ.... సరిపడా సిబ్బందిని నియమించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. లైన్‌మెన్‌లను వెంటనే నియమించాలి.
- కండె సమ్మయ్య, చిట్యాల
వైఎస్ హయాంలో పెంచలేదు
టారిఫ్ పెంపు ప్రతిపాదనలను ఆమోదించరాదు. విద్యుత్ కొనుగోలు లోపాల వల్ల నష్టం వస్తోంది. ఈ నష్టాలను నివారించాలి. రిలయన్స్ లాంటి సంస్థలకు అధిక మొత్తాలను కట్టబెడుతున్నారు. ఒప్పందాల ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా చర్యలు తీసుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్క పైసా విద్యుత్ చార్జీ పెంచలేదు. సంస్థాగత సామర్థ్యాన్ని పెంచుకోవాలి. బొగ్గు కొరత కారణంగా దిగుమతి చేసుకోవడం వల్ల భారం పెరుగుతోంది. మూడు వేలకు బదులు నాలుగున్నర వేల ధరకు టన్ను బొగ్గు కొనుగోలు చేయడం వల్ల నష్టం వస్తోంది. ప్రజల మీద భారం వేసే ప్రతిపాదనలు ఆమోదించవద్దు.
- జనక్‌ప్రసాద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
విచారణ నామమాత్రమే...
బహిరంగ విచారణ ప్రహసనంగా మారుతోంది. ఇక్కడ చేస్తున్న సూచనలు పరిగణనలోకి తీసుకుంటలేరు. వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలి. రాత్రి పూట సరఫరా చేస్తే ఎట్లా? ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోతే సిబ్బంది మార్చడం లేదు. ఒక్కో రైతు నుంచి రూ.150 - రూ.200 వసూలు చేస్తున్నారు. విద్యుత్ అందక పంటలు ఎండితే పరిహారం చెల్లించాలి. ఇందుకు మండలస్థాయిలో కమిటీ వేయాలి. నేదునూరు ప్లాంట్‌కు గ్యాస్ కేటాయించాలి. 2013-14లో 96 ప్రమాదాలు జరిగితే 38 మంది రైతులకే పరిహారం చెల్లించారు.
- ముకుందరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
కార్పొరేట్ అనుకూల పాలసీలు
విద్యుత్ సంస్థల పాలసీలన్నీ కార్పొరేటుకు అనుకూలంగా ఉన్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రా జెక్టులు ఉత్పత్తి ప్రారంభించకుండానే క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పేర స్థిర చార్జీలు పొందుతున్నా యి. ఒక్క యూనిట్ కరెంట్ ఇవ్వకుండానే కోట్లు వసూలు చేసుకుంటున్నాయి. లార్డ్ వెంకటేశ్వర పవర్ ప్రాజెక్టుకు ఇలా కోట్లు చెల్లించి... ఈ భారాన్ని ప్రజలపై వేయడం ఏంటి? చార్జీల పెంపు ప్రతిపాదనలు హేతుబద్ధంగా లేవు.
- గాదె దివాకర్, రైతు నాయకుడు
కొనుగోలు ధరలపై నియంత్రణ
సరఫరా నష్టాలకు వినియోగదారులను బాధ్యు లు చేయడం తగదు. విద్యుత్ కొనుగోలు వ్యవహారాలను ప్రాజెక్టుల వారీగా పరిశీలించాలి. విద్యుత్ కొనుగోలు ధరలపై నియంత్రణ ఉండాలి. పారిశ్రామిక రంగంపై భారం పెంచితే పరిశ్రమలు ఖాయిలా పడే పరిస్థితి ఉంటుంది.
- వి.అనిల్‌రెడ్డి, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు
పైసా పెంచొద్దు
Published Fri, Jan 24 2014 1:49 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement