చిత్తూరు ఎడ్యుకేషన్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే సరిగా స్పందిం చడం లేదని జెడ్పీటీసీ సభ్యులు ఆరోపించారు. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య ధోరణిని వారు సభ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా 1, 7 కమిటీ సమావేశాలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, పుంగనూరు జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా జిల్లా పరిషత్ ఆర్థిక పరిస్థితి అడుగుతున్నా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దీంతో పాలకమండలిని అనుమానించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో అధికార పార్టీ జెడ్పీటీసీలకు, వెంకటరెడ్డి యాదవ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్పందించిన చైర్‌పర్సన్ ఆర్థిక పరిస్థితుల నివేదికలను సభ్యులకు అందజేయడంతో వారు శాంతించారు. వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ పుంగనూరు పాలెంపల్లి పంచాయతీ దగ్గరాజుచెరువుకు ఆయకట్టు అవసరముందని ఇరిగేషన్ అధికారులను కోరారు. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయానికి ప్రహరీ గోడ లేకపోవడంతో దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే స్థలం అన్యాక్రాంతమవుతోందన్నారు. జెడ్పీ బడ్జెట్‌లోని ఆస్తు ల సంరక్షణ నిధులను గోడ నిర్మాణానికి విడుదల చేయాలని కోరారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని నాలుగు సంవత్సరాలుగా చెబుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దళితవాడల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులను ఎందుకు శుద్ధి చేయించడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను సభ్యులు ప్రశ్నించారు. గ్రామాల్లో మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరా రు. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ శాఖల మధ్య సమన్వయం లేదని సభ్యులు మండిపడ్డారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఆస్తుల రిజిస్టర్లను అమలు చేయాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పూతలపట్టు హైవే, చిత్తూరు గాంధీ రోడ్డు నుంచి అరగొండ వరకు ఇష్టానుసారం స్పీడ్ బ్రేకర్లు వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతున్నా ప్రశ్నించరా..
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయాన్ని పాలకమండలి సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని సభ్యులు ప్రశ్నించారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎన్నికైనప్పటి నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక ఉత్సవవిగ్రహాల్లా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సభ్యులందరూ ఐక్యంగా పోరాడాలని జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ పిలుపునిచ్చారు.
విద్యుత్ ఎస్‌ఈపై చైర్‌పర్సన్ ఆగ్రహం..
స్థాయీ సంఘ సమావేశాలకు హాజరుకాని విద్యుత్ శాఖ ఎస్‌ఈపై జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారమివ్వకుండా నిలిచిపోయిన ఇతర శాఖల జిల్లా అధికారులకు మెమోలు జారీచేయాలని ఆమె ఆదేశించారు. కారణం లేకుండా గ్రామాల్లో ఇష్టానుసారంగా కరెంట్ కోత విధిస్తున్నారని చైర్‌పర్సన్ మండిపడ్డారు. దొంగలున్నారని గ్రామాల వాసులు భయపడుతుంటే రాత్రుల్లో కరెంట్ కట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సంఘ సమావేశాల్లో కోరం లేక 3, 4, 6 వాయిదా పడ్డాయి. సమావేశాల్లో ఇన్‌చార్జి సీఈఓ రవికుమార్ నాయుడు, ఏఓలు ప్రభాకర్‌రెడ్డి, వెంకట రత్నం, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment