విద్యుత్ పథకానికి ‘వంద’నాలు
- 4.5 లక్షల కుటుంబాలకు మేలు
- వైఎస్ జగన్ ప్రకటనపై హర్షాతిరేకాలు
- ప్రతి నెలా జిల్లాకు రూ.22.50 కోట్లు ఆదా
- ఒక్కో కుటుంబానికి రూ.500 వరకు లబ్ధి
- పెద్దాయన్ని గుర్తుచేసుకుంటున్న పేదలు
విద్యుత్ బిల్లుల భారాలను మోయలేక.. కరెంటును పొదుపుగా వాడుకుంటూ నానా అవస్థలు పడుతున్న ప్రజానీకానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. 150 యూనిట్ల విద్యుత్ వాడుకున్న ఇంటికి కేవలం వంద రూపాయలే వసూలుచేస్తామంటూ విజయనగరం జిల్లా సాలూరులో మంగళవారం ఆయన చెప్పినప్పటినుంచి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండుటెండల్లో చల్లని పన్నీటి జల్లులాంటి మాటలు చెప్పారని జననేతకు జేజేలు పలుకుతున్నారు.
సాక్షి, విజయవాడ : విద్యుత్ వైర్లను తాకితే షాక్‌కొడతాయని తెలుసు.. కానీ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బిల్లుల్ని చూస్తేనే జనాలు షాక్‌కు గురయ్యారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు. ఆయన తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు చార్జీలను ఎడాపెడా వడ్డించారు. విద్యుత్ చార్జీలకుతోడు సర్‌చార్జీలు కూడా కలిపిన బిల్లుచూసి వినియోగదారుల గుండెలు గుభేల్మంటున్నాయి.
ఈ నేపథ్యంలో పేదలకు వస్తున్న విద్యుత్ బిల్లులను చూసి చలించి పోయిన జగన్‌మోహన్‌రెడ్డి ‘వంద రూపాయలకే 150 యూనిట్ల విద్యుత్ పథకం’ ప్రకటించడం హర్షణీయమని జిల్లావాసులు అంటున్నారు. ఇది ఎగువ మధ్యతరగతి వర్గాల వరకు బాగా ఉపయోగపడుతుందని విద్యుత్‌సంస్థల అధికారులు చెబుతున్నారు.
లబ్ధి పొందేది ఎలా..
జిల్లాలో 10.79 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
వీటిలో సుమారుగా 4.5 లక్షల కనెక్షన్లు నెలకు 150 యూనిట్ల లోపే విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ వినియోగదారులు నెలకు రూ.600 వరకు విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టనున్న పథకం వల్ల ఒక్కో కుటుంబానికి నెలకు రూ.500 వరకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది.
విద్యుత్ బిల్లు ఇలా...
విద్యుత్ మండలి మొదటి 250 యూనిట్లు వాడుకునేవారిపైనే కరెంటు చార్జీల భారం ఎక్కువగా మోపింది. ఆ తరువాత స్లాబ్‌లపై పెరిగే రేటుతో తక్కువగానే ఉంటుంది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన 150 యూనిట్లకు ప్రస్తుతం ఉన్న టారిఫ్ ప్రకారం చార్జీలు ఈ విధంగా ఉంటాయి. యూనిట్లకు రూ.2.60 చొప్పున రూ.130
51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.3.25 చొప్పున రూ.162.50
101 నుంచి 150 యూనిట్ల వరకు రూ.4.80 చొప్పున రూ.240 వసూలు చేస్తారు.
ఈ లెక్కన విద్యుత్ బిల్లు రూ. 532.50 వస్తుంది. దీనిపై మీటర్ అద్దె సర్వీస్ చార్జీ, విద్యుత్ సర్‌చార్జీలు కలుపుకొంటే సుమారు రూ.600 అవుతుందని ఎస్పీడీసీఎల్ అధికారులే చెబుతున్నారు. ఈ విధంగా జిల్లాలో ఉన్న 4.5లక్షల విద్యుత్ వినియోగదారులు ప్రతినెల రూ.27 కోట్లు ఎస్పీడీసీఎల్‌కు చెల్లిస్తున్నారు. ఈ బిల్లు చెల్లించకపోతే వచ్చే నెలలో అదనంగా మరో రూ.100 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కాగా జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన ప్రకారం పథకమే అమలు చేస్తే రూ.100 కడితే సరిపోతుంది. దీనివల్ల కేవలం రూ.4.50 కోట్లు మాత్రమే ఖజానాకు ఆదాయం రాగా పేద, మధ్య తరగతి ప్రజలకు నెలకు రూ.22.50 కోట్ల వరకు రాయితీ వస్తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ భారాన్ని భరించేందుకు సిద్ధమని వైఎస్ జగన్ చేసిన ప్రకటన విన్న ప్రజలు.. ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచని రాజన్నను గుర్తుచేసుకుంటూ నీరాజనం పడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీలను మోసగించిన కాంగ్రెస్..
నెలకు 50 యూనిట్లులోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అనేకమంది పేదలు కేవలం ఒక్కబల్బు వాడుకుని 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్నారు. ఇప్పుడు వారి కుల ధ్రువీకరణపత్రాలు విద్యుత్ శాఖకు ఇస్తేనే రాయితీ ఇస్తామని ప్రకటించడంతో ఎస్సీ,ఎస్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత్రాలు ఇవ్వని వారి నుంచి పాత బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.