సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర వారం, పదిరోజుల తరువాత పునఃప్రారంభం కానుంది. భుజానికి అయిన గాయం ఇంకా పూర్తిగా మానకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో గత నెల అక్టోబర్ 25న జగన్‌పై కత్తితో హత్యాయత్నం జరిగిన సమయంలో భుజానికి గాయం అయింది. అనంతరం ఆయన హైదరాబాద్‌కు రాగానే వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అప్పటినుంచి ఆయన వైద్యుల సూచనతో విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం సిటీ న్యూరో సెంటర్ వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది. భుజం గాయం ఇంకా మానలేదని వారు స్పష్టం చేస్తూ కనీసం ఇంకా మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. పరీక్షల అనంతరం డాక్టర్ సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 3.5 సెంటీమీటర్ల లోతైన గాయం కనుక జగన్ భుజానికి శస్త్రచికిత్స చేసినపుడు కండరంలో కొంత భాగాన్ని తొలగించామని అందువల్ల మానడానికి సమయం పడుతుందన్నారు.
చేయి కదిల్చినపుడు ఇంకా నొప్పి ఉన్నట్లు గుర్తించామన్నారు. అందుకే మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని, కనీసం 7 నుంచి పది రోజులైనా కదల కూడదన్నామని అన్నారు. అయితే జగన్ మాత్రం తొందరగా పాదయాత్రను పునఃప్రారంభించాలని పట్టుదలతో ఉన్నారన్నారు. పాదయాత్రలో చేయి ఎత్తి ప్రజలకు అభివాదం చేయాల్సి ఉంటుందని, ప్రజలను ఉద్దేశించి చేయి ఊపాల్సి ఉంటుందని, గాయం మానుతున్న క్రమంలో ఇలా చేస్తే అంత త్వరగా మానదని, పైగా దీర్ఘకాలిక నొప్పిగా పరిణమించే ప్రమాదం ఉందని తాము జగన్‌కు వివరించామన్నారు. పైన చర్మంపై ఉన్న గాయం మానినప్పటికీ లోపలి నుంచి ఇంకా బాధిస్తూనే ఉందన్నారు. అందుకే ఈ దశలో ఎక్కువగా కదలికలు అసలు వద్దని, బయటకు రావద్దని సలహా ఇచ్చామన్నారు. తాము మళ్లీ 6, 7 రోజుల తరువాత పరీక్షించి తదుపరి సలహా ఇస్తామన్నారు. జగన్‌ను పరీక్షించిన సిటీ న్యూరో వైద్య బృందంలో డాక్టర్లు శేషగిరిరావు, బి.చంద్రశేఖరరెడ్డి, జ్ఞానేశ్వర్, మధుసూదనరావు, శివభరత్‌రెడ్డి ఉన్నారు.
పునఃప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తాం
కత్తిపోటు వల్ల జగన్‌కు తగిలిన గాయం తగ్గని కారణంగా వైద్యుల సలహాను అనుసరించి పాదయాత్ర వారం, పదిరోజుల తరువాత తిరిగి మొదలవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాదయాత్ర పునఃప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment