పీఆర్సీపై కసరత్తు ప్రారంభం
- అధికారులతో సమావేశమైన ఆర్థిక మంత్రి
- పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమానికి సిద్ధం: జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఫిట్‌మెంట్, ఆర్థిక లబ్ధి తదితర అంశాల మీద ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం అధికారులతో మాట్లాడారు. 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తే ఖజానాపై వాస్తవంగా ఎంత భారం పడుతుందనే విషయం మీద చర్చ జరిగినట్లు తెలిసింది. ఉద్యోగుల వాస్తవ సంఖ్యతో పాటు ఖాళీలను లెక్కలోకి తీసుకుని 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేస్తే ఏటా రూ.7 వేల కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు.
అయితే ఉద్యోగుల వాస్తవ సంఖ్య ప్రకారం చూస్తే పీఆర్సీ అమలు భారం ఏటా రూ.3,500 కోట్లకు మించదని అంచనాకు వచ్చినట్లు సమాచారం. 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే అన్ని క్యాడర్ ఉద్యోగులకు 3 స్టేజీల ఇంక్రిమెంట్ పెరుగుతుందని, 46 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించినా ఇదే పెంపు వర్తిస్తుందని, 47 శాతం అమలు చేస్తేనే నాలుగో స్టేజి ఇంక్రిమెంట్ వర్తిస్తుందని అధికారులు నివేదించినట్లు తెలిసింది.
44-45 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి తెలంగాణ కంటే ఎక్కువ ఇచ్చామనే భావన ఉద్యోగుల్లో కల్పించాలని, ఈ విధంగా చేస్తే ఖజానా మీద అదనపు భారం పడదని చెప్పినట్లు సమాచారం. అయితే ఆర్థిక లబ్ధిని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తే భారం చాలావరకు తగ్గించుకోవచ్చనే యోచనలో ఆర్థిక మంత్రి ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
ఈ విషయాలను సోమవారం జరగనున్న ఉపసంఘ సమావేశంలో చర్చించి, వెంటనే ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వడానికి సమాయత్తమవుతున్నారు. పీఆర్సీ సిఫారసు చేసినట్లు ఆర్థిక లబ్ధిని 2013 జూలై నుంచి అమలు కు ఉద్యోగ సంఘాల జేఏసీ పట్టుబడుతోంది.
నేడు జేఏసీ భేటీ
తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో కూడా పీఆర్సీ అమలు కోసం ఉద్యోగుల నుంచి అన్ని సంఘాల నేతలకు ఒత్తిడి వస్తోంది. జేఏసీ నాయకత్వ మెతక వైఖరి వల్లే పీఆర్సీ అమల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ నాయకత్వం భావిస్తోంది. సోమవారం ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించింది. ఉపసంఘం సీఎం నివేదిక సమర్పించిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం మాట్లాడే అవకాశం ఉందని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపు వస్తే ఏం మాట్లాడాలనే విషయాన్ని నిర్ణయించడానికి ఉదయం 11 గంటలకు జేఏసీ నేతలు ఏపీఎన్జీవో హోంలో సమావేశం కావాలని నిర్ణయించారు.
స్పందించకపోవడం నష్టమే
తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా పీఆర్సీ అమలు గురించి ఏపీ స్పందించకపోవడం ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుం ది. హామీ అమలు చేయడానికైనా తెలంగాణ కంటే మెరుగైన ఫిట్‌మెంట్, ఆర్థిక లబ్ధి అమలు చేయాలి. లేదంటే ఉద్యమం తప్పదు.
- ఐ.వెంకటేశ్వరరావు, జేఏసీ సెక్రటరీ జనరల్
డిమాండ్లపై వెనక్కితగ్గం
ఫిట్‌మెంట్, ఆర్థిక లబ్దితో సహ జేఏసీ ఇప్పటికే సమర్పించిన డిమాండ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడం. అవసరమైతే ఉద్యమానికీ సిద్ధమే.
- కత్తి నరసింహారెడ్డి, జేఏసీ కో చైర్మన్
వెంటనే ప్రకటించాలి
తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీని ప్రకటించాలి. ఆర్థిక లబ్దిని 2013 జూలై నుంచి వర్తింపజేయాలి. తగ్గించాలని చూ స్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం.
- బొప్పరాజు వెంకటేశ్వర్లు, జేఏసీ కో చైర్మన్