మార్చిలోగా సాధ్యం కాదు.. జూన్ వరకు గడువు పెంచాలి
ప్రభుత్వానికి 10వ పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి నివేదికను మార్చిలోగా సమర్పించడం సాధ్యం కాదని జూన్ రెండో వారం వరకు గడువు పెంచాలని 10వ వేతన సవరణ సంఘం(పీఆర్సీ) చైర్మన్ పి.కె.అగర్వాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ గత ఏడాది మార్చిలో ఏర్పాటైంది. పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం తగినంత మంది సిబ్బందిని కేటాయించడానికి ప్రభుత్వం 4 నెలల సమయం తీసుకుంది. వేగంగా కసరత్తు ప్రారంభించి సకాలంలో నివేదిక సమర్పించడానికి ప్రభుత్వమే వీల్లేకుండా చేసింది. పీఆర్సీ చైర్మన్‌కు కార్యదర్శిని నియమించడానికి 8 నెలల సమయం తీసుకుంది. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవటంతో కమిషన్ ఆలస్యంగా కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వినతులందటంతో 850 క్యాడర్ల కూర్పు బాధ్యత కమిషన్‌పై పడింది. కేవలం జీత భత్యాల సవరణ బాధ్యతేకాక మారుతున్న పరిస్థితులకనుగుణంగా ‘మానవ వనరుల అభివృద్ధి’ విధానంలో మార్పులను సిఫార్సు చేసే బాధ్యతనూ పీఆర్సీకి అప్పగించారు. దీంతో కమిషన్ నివేదిక రూపకల్పన సకాలంలో పూర్తి చేయలేకపోయింది. గడువు పెంపు కోరినందున పీఆర్సీ అమలు మరింత జాప్యమయ్యే సూచనలున్నాయి. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకుంటామని ఐఆర్ మంజూరు సమయంలో ఉద్యోగ సంఘాలకు సీఎం కిరణ్ హామీ ఇవ్వడం విదితమే. సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, సకాలంలో పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గడువు పెంపునకు అంగీకరించవద్దని ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పీఆర్సీ మరింత జాప్యం!
Published Sun, Feb 16 2014 2:19 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement