employees salary
-
ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ అకౌంట్స్ తెలిపాయి. 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్‌ను కాగ్ వెల్లడించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం చేసినట్లు పేర్కొంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. అలాగే, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్ కేటాయింపులకు మించి అయినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి.2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల కోసం రూ.50,882 కోట్లు కేటాయించగా రూ.52,010 కోట్లు వ్యయం అయ్యాయని, పెన్షన్ కోసం బడ్జెట్లో రూ.21,183 కోట్లు కేటాయించగా రూ.21,694 కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది. సామాజిక రంగం వ్యయంలో (విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) రూ.1,10,375 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు, ఆర్థిక సేవలకు రూ.57,344 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. 2023–24 ఆర్థిక ఏడాది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 91.97% వ్యయం చేసినట్లు తెలిపింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు రూ.–37,468 కోట్లు ఉండగా ద్రవ్య లోటు రూ.–61,765 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది,గత ఐదేళ్ల బడ్జెట్లో మూల ధన వ్యయం ఇలా..ఆర్థిక ఏడాది మూల ధన వ్యయం (రూ.కోట్లలో) 2019–20 17,601 2020–21 20,690 2021–22 18,511 2022–23 7,581 2023–24 23,589 మొత్తం రూ. 87,972 -
ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకూ సంక్షేమం
ఎర్రుపాలెం: ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఈనెల ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందించామని, రాష్ట్రంలోని 3.65 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2.85 లక్షల మంది పెన్షన్‌దారులకు వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. 2019 ఆగస్టు నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చిన చరిత్ర లేదని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరమ్మ రాజ్యం వచ్చాకే ఇది సాధ్యమైందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఉద్యోగులు సైతం పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని చెప్పారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, ఆరు గ్యారంటీల అమలులో అలసత్వం లేకుండా పనిచేయాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాల కోసం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని, 3 నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. గ్రూప్–1, డీఎస్సీ తదితర నోటిఫికేషన్లు కూడా జారీ చేశామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్‌లో అద్భుతమైన స్టూడియో నిర్మించి నిష్ణాతులైన అధ్యాపకులతో టైమ్ టేబుల్ ప్రకటించి నిరుద్యోగులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. భట్టి వెంట ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. -
మాన్సాస్ జీతాల వివాదం: చోద్యం చూస్తున్న అశోక్ గజపతిరాజు
సాక్షి, విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఆధీనంలోనున్న 12 విద్యాసంస్థల సిబ్బంది, ఉద్యోగుల జీతాల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. ట్రస్టు చైర్మన్ హోదాలో దీన్ని పరిష్కరించాల్సిన టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు నిరాటకంగా చేస్తూనే ఉన్నారు. సంచయిత నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఆయన సానుకూల తీర్పునే పొందారు. చైర్మన్‌గా పునర్నియామకమై దాదాపు రెండు నెలలైనా ట్రస్టు బోర్డును మాత్రం పట్టించుకోలేదు. కనీసం బోర్డు సమావేశాన్నీ ఏర్పాటు చేయలేదు. నిబంధనల ప్రకారం బోర్డు తీర్మానాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఇన్నాళ్లూ విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా నిర్ణయాలు తీసుకుంటున్న కేవీఎల్ రాజు పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. కరస్పాండెంట్‌తో సంయుక్తంగా చెక్ పవర్ ఉన్న చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) హర్నీద్ర ప్రతాప్ సింగ్‌ను బోర్డు తీర్మానంతో సంబంధం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బాధ్యతల నుంచి తప్పించేశారు. అశోక్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండురోజులకే ఆ నిర్ణయం జరిగిపోయింది. బ్యాంకింగ్ లావాదేవీల్లో జాయింట్ చెక్ పవర్ ఉన్న అధికారిని తొలగించేస్తే ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది. అదీ బోర్డు తీర్మానంతో జరగాలి. బోర్డును సమావేశపరచకుండా ఈ రెండు నెలలూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన అశోక్ గజపతిరాజు... ఉద్యోగుల జీతాలు నిలిచిపోయినందుకు నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదీ పరిస్థితి... ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఎంఆర్ కళాశాల, ఎంఆర్ మహిళా కళాశాల, ఎంఆర్ ఫార్మసీ, ఎంఆర్ పీజీ, మాన్సాస్ ఇంగ్లిష్ మీడియం తదితర 12 విద్యాసంస్థలు మాన్సాస్ ట్రస్ట్ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 800 మంది ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల ప్రక్రియను మొదటి నుంచి విద్యా సంస్థల కరస్పాండెంట్ చూసుకుంటున్నారు. ఆ ఖర్చుల కోసం బోర్డు తీర్మానంతోనే నిధులు విడుదలవుతాయి. ట్రస్ట్ కార్యకలాపాలన్నీ సవ్యంగా జరిగేలా పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక కార్యనిర్వాహణాధికారి (ఈవో)ను నియమిస్తోంది. బోర్డు తీర్మానం మేరకు రూ. 3.50 కోట్ల ఫండ్‌ను మొదటి విడతలో, మరో రూ.2.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను రెండవ విడతలో ఈఓ ఏటా విడుదల చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఏవిధంగా వినియోగించారన్నదీ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఈఓకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ల (యూసీల)ను సమర్పిస్తున్నారు. ఇదీ ఏటా జరుగుతున్న ప్రక్రియే. కానీ కొన్ని దశాబ్దాలుగా ఆడిటింగ్ జరగకపోవడంతో ట్రస్టులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్టులో ప్రక్షాళన ప్రారంభించింది. చట్టం ప్రకారం ట్రస్టులో నియామకాలు చేపట్టింది. విచ్చలవిడిగా నిధుల వ్యయానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బోర్డు తీర్మానం మేరకు సీఎఫ్ఓను నియమించింది. కరస్పాండెంట్, సీఎఫ్ఓల జాయింట్ అకౌంట్ ద్వారా జీతాలు, ఇతర ఖర్చుల వ్యవహారాలు జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి నిర్ణయాలతో గత ఏడాదిగా మాన్సాస్ ట్రస్టు విద్యాసంస్థల్లో ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు ప్రక్రియ జరుగుతోంది. అశోక్ సహా 11 మందిపై కేసు నమోదు మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులు దాడి చేశారంటూ ఈఓ డి.వెంకటేశ్వరరావు విజయనగరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి ప్రేరేపించిన అశోక్, కరస్పాండెంట్‌తో పాటు దాడి చేయడంతో పాటు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పది మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు సీఐ జె.మురళీ వెల్లడించారు. అశోక్ పునరాగమనంతో చిక్కుముడి.. మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం 2020 మార్చి 3వ తేదీన జీఓలు 73, 74 జారీ చేసింది. అదే సమయంలో మాన్సాస్ బోర్డు సభ్యులను నియమిస్తూ జీఓ 75ను విడుదల చేసింది. ఈ బోర్డులో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళా గజపతిరాజుతో పాటు ఆర్వీ సునీత ప్రసాద్, అరుణ్ కపూర్, విజయ్ కె.సోంథీ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్నారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ హైకోర్టును ఆశ్రయించారు. జీఓలు 73, 74లను సవాల్ చేశారు. అయితే, ఆయన పిటిషన్లో బోర్డుకు సంబంధించిన జీఓ 75ను ప్రస్తావించలేదు. హైకోర్టు జీఓలు 73, 74లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం అశోక్ చైర్మన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టారు. అయితే, బోర్డును మాత్రం ఇప్పటివరకూ సమావేశపరచిన దాఖలాల్లేవు. బోర్డు తీర్మానం లేకుండానే సీఎఫ్ఓను అశోక్ ఏకపక్షంగా తొలగించేశారు. పూర్వ పద్ధతిలోనే కరస్పాండెంట్ జీతాలు చెల్లించాలని ఆదేశించారు. కానీ నిబంధనల ప్రకారం కరస్పాండెంట్‌తో పాటు సీఎఫ్ఓ కూడా సంతకం చేస్తేనే బ్యాంకు నుంచి విత్‌డ్రా కుదరని పరిస్థితి ఏర్పడింది. అది సవ్యంగా జరిగితేనే డబ్బులు ఇస్తామని బ్యాంకులు తేల్చి చెప్పేశాయి. బ్యాంకులతో ఏర్పడిన చిక్కుముడికి తానే కారణమన్న విషయాన్ని అశోక్, కరస్పాండెంట్ కేవీఎల్ రాజు రాజకోట రహస్యం చేసేశారు. జీతాలు నిలిచిపోవడానికి కారణం ఈఓనే అంటూ ఉద్యోగులను ఉసిగొల్పడం గమనార్హం. జీతాల చెల్లింపు మా పరిధి కాదు... నిబంధనల మేరకు ట్రస్ట్‌లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా బోర్డు ఆమోదం తప్పనిసరి. విద్యాసంస్థల జీతాల చెల్లింపు అంతా కరస్పాండెంట్ చూస్తున్నారు. ఈఓగా కేవలం నిధుల కేటాయింపు వరకే చూస్తాం. బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకూ జరగలేదు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బోర్డు సమావేశం గురించి మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కొత్త సీఎఫ్ఓ ఎవరో ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. కరస్పాండెంట్, సీఎఫ్ఓ సంతకాలు చేస్తేనే బ్యాంకుల నుంచి ఉద్యోగులకు జీతాల సొమ్ము విడుదల అవుతుంది. – డి.వెంకటేశ్వరరావు, ఈఓ, మాన్సాస్ ట్రస్టు -
విభజనకు రెండు రోజుల ముందే వేతనాలు, పెన్షన్లు
సాక్షి, హైదరాబాద్: విభజనకు రెండు రోజుల ముందే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ చెల్లించేందుకు ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. సాధారణంగా వేతనాలు, పెన్షన్ ఒకటో తేదీన చెల్లిస్తారు. జూన్ 2న రాష్ట్ర విభజన జరగనుంది. మే 31 శనివారం, జూన్ 1 ఆదివారం వస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. ఈ నేపథ్యంలో మే 31న రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలను, పెన్షన్‌దారులకు పెన్షన్ల చెల్లింపులను పూర్తిచేయాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు బకాయిలు ఉండరాదని ఆర్థికశాఖ నిర్ణయించింది. జూన్ 2నుంచి రెండు ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నందున ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఆయా రాష్ట్రాలకు పంపిణీ అవుతారు. అంటే జూన్ నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆర్థికశాఖ సిద్ధం చేసింది. త్వరలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం ఆర్థికశాఖ ఏప్రిల్‌లో పెద్ద మొత్తంలో అప్పు చేయనుంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని పనులకు విభజనకు ముందే చెల్లింపులు చేయాలని యోచిస్తున్న ఆర్థికశాఖ అందుకు ఎన్ని నిధులు అవసరమవుతాయనే విషయంపై దృష్టి సారించింది. పనులు పూర్తిచేసి బిల్లుల రూపంలో ఉన్న వాటికైనా ఎన్ని నిధులు అవసరమవుతాయో అంచనా వేసి వాటినైనా చెల్లించాలని భావిస్తోంది. విభజన అనంతరం ఏ ప్రాంతంలో పనులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లింపులు చేస్తాయని, ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పనులు జరిగి బిల్లు ప్రభుత్వానికి సమర్పించి ఉన్నా వాటిని చెల్లించాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. -
పీఆర్సీ మరింత జాప్యం!
మార్చిలోగా సాధ్యం కాదు.. జూన్ వరకు గడువు పెంచాలి ప్రభుత్వానికి 10వ పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి నివేదికను మార్చిలోగా సమర్పించడం సాధ్యం కాదని జూన్ రెండో వారం వరకు గడువు పెంచాలని 10వ వేతన సవరణ సంఘం(పీఆర్సీ) చైర్మన్ పి.కె.అగర్వాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ గత ఏడాది మార్చిలో ఏర్పాటైంది. పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం తగినంత మంది సిబ్బందిని కేటాయించడానికి ప్రభుత్వం 4 నెలల సమయం తీసుకుంది. వేగంగా కసరత్తు ప్రారంభించి సకాలంలో నివేదిక సమర్పించడానికి ప్రభుత్వమే వీల్లేకుండా చేసింది. పీఆర్సీ చైర్మన్‌కు కార్యదర్శిని నియమించడానికి 8 నెలల సమయం తీసుకుంది. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవటంతో కమిషన్ ఆలస్యంగా కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వినతులందటంతో 850 క్యాడర్ల కూర్పు బాధ్యత కమిషన్‌పై పడింది. కేవలం జీత భత్యాల సవరణ బాధ్యతేకాక మారుతున్న పరిస్థితులకనుగుణంగా ‘మానవ వనరుల అభివృద్ధి’ విధానంలో మార్పులను సిఫార్సు చేసే బాధ్యతనూ పీఆర్సీకి అప్పగించారు. దీంతో కమిషన్ నివేదిక రూపకల్పన సకాలంలో పూర్తి చేయలేకపోయింది. గడువు పెంపు కోరినందున పీఆర్సీ అమలు మరింత జాప్యమయ్యే సూచనలున్నాయి. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకుంటామని ఐఆర్ మంజూరు సమయంలో ఉద్యోగ సంఘాలకు సీఎం కిరణ్ హామీ ఇవ్వడం విదితమే. సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, సకాలంలో పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గడువు పెంపునకు అంగీకరించవద్దని ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.