సాక్షి, విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఆధీనంలోనున్న 12 విద్యాసంస్థల సిబ్బంది, ఉద్యోగుల జీతాల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. ట్రస్టు చైర్మన్ హోదాలో దీన్ని పరిష్కరించాల్సిన టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు నిరాటకంగా చేస్తూనే ఉన్నారు. సంచయిత నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఆయన సానుకూల తీర్పునే పొందారు. చైర్మన్‌గా పునర్నియామకమై దాదాపు రెండు నెలలైనా ట్రస్టు బోర్డును మాత్రం పట్టించుకోలేదు. కనీసం బోర్డు సమావేశాన్నీ ఏర్పాటు చేయలేదు. నిబంధనల ప్రకారం బోర్డు తీర్మానాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు.
ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఇన్నాళ్లూ విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా నిర్ణయాలు తీసుకుంటున్న కేవీఎల్ రాజు పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. కరస్పాండెంట్‌తో సంయుక్తంగా చెక్ పవర్ ఉన్న చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) హర్నీద్ర ప్రతాప్ సింగ్‌ను బోర్డు తీర్మానంతో సంబంధం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బాధ్యతల నుంచి తప్పించేశారు. అశోక్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండురోజులకే ఆ నిర్ణయం జరిగిపోయింది. బ్యాంకింగ్ లావాదేవీల్లో జాయింట్ చెక్ పవర్ ఉన్న అధికారిని తొలగించేస్తే ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది. అదీ బోర్డు తీర్మానంతో జరగాలి. బోర్డును సమావేశపరచకుండా ఈ రెండు నెలలూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన అశోక్ గజపతిరాజు... ఉద్యోగుల జీతాలు నిలిచిపోయినందుకు నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇదీ పరిస్థితి...
ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఎంఆర్ కళాశాల, ఎంఆర్ మహిళా కళాశాల, ఎంఆర్ ఫార్మసీ, ఎంఆర్ పీజీ, మాన్సాస్ ఇంగ్లిష్ మీడియం తదితర 12 విద్యాసంస్థలు మాన్సాస్ ట్రస్ట్ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 800 మంది ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల ప్రక్రియను మొదటి నుంచి విద్యా సంస్థల కరస్పాండెంట్ చూసుకుంటున్నారు. ఆ ఖర్చుల కోసం బోర్డు తీర్మానంతోనే నిధులు విడుదలవుతాయి. ట్రస్ట్ కార్యకలాపాలన్నీ సవ్యంగా జరిగేలా పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక కార్యనిర్వాహణాధికారి (ఈవో)ను నియమిస్తోంది. బోర్డు తీర్మానం మేరకు రూ. 3.50 కోట్ల ఫండ్‌ను మొదటి విడతలో, మరో రూ.2.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను రెండవ విడతలో ఈఓ ఏటా విడుదల చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఏవిధంగా వినియోగించారన్నదీ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఈఓకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ల (యూసీల)ను సమర్పిస్తున్నారు. ఇదీ ఏటా జరుగుతున్న ప్రక్రియే.
కానీ కొన్ని దశాబ్దాలుగా ఆడిటింగ్ జరగకపోవడంతో ట్రస్టులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్టులో ప్రక్షాళన ప్రారంభించింది. చట్టం ప్రకారం ట్రస్టులో నియామకాలు చేపట్టింది. విచ్చలవిడిగా నిధుల వ్యయానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బోర్డు తీర్మానం మేరకు సీఎఫ్‌ఓను నియమించింది. కరస్పాండెంట్, సీఎఫ్‌ఓల జాయింట్ అకౌంట్ ద్వారా జీతాలు, ఇతర ఖర్చుల వ్యవహారాలు జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి నిర్ణయాలతో గత ఏడాదిగా మాన్సాస్ ట్రస్టు విద్యాసంస్థల్లో ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు ప్రక్రియ జరుగుతోంది.
అశోక్ సహా 11 మందిపై కేసు నమోదు
మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులు దాడి చేశారంటూ ఈఓ డి.వెంకటేశ్వరరావు విజయనగరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి ప్రేరేపించిన అశోక్, కరస్పాండెంట్‌తో పాటు దాడి చేయడంతో పాటు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పది మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు సీఐ జె.మురళీ వెల్లడించారు.
అశోక్ పునరాగమనంతో చిక్కుముడి..
మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం 2020 మార్చి 3వ తేదీన జీఓలు 73, 74 జారీ చేసింది. అదే సమయంలో మాన్సాస్ బోర్డు సభ్యులను నియమిస్తూ జీఓ 75ను విడుదల చేసింది. ఈ బోర్డులో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళా గజపతిరాజుతో పాటు ఆర్‌వీ సునీత ప్రసాద్, అరుణ్ కపూర్, విజయ్ కె.సోంథీ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్నారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ హైకోర్టును ఆశ్రయించారు. జీఓలు 73, 74లను సవాల్ చేశారు. అయితే, ఆయన పిటిషన్‌లో బోర్డుకు సంబంధించిన జీఓ 75ను ప్రస్తావించలేదు. హైకోర్టు జీఓలు 73, 74లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం అశోక్ చైర్మన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టారు.
అయితే, బోర్డును మాత్రం ఇప్పటివరకూ సమావేశపరచిన దాఖలాల్లేవు. బోర్డు తీర్మానం లేకుండానే సీఎఫ్‌ఓను అశోక్ ఏకపక్షంగా తొలగించేశారు. పూర్వ పద్ధతిలోనే కరస్పాండెంట్ జీతాలు చెల్లించాలని ఆదేశించారు. కానీ నిబంధనల ప్రకారం కరస్పాండెంట్‌తో పాటు సీఎఫ్‌ఓ కూడా సంతకం చేస్తేనే బ్యాంకు నుంచి విత్‌డ్రా కుదరని పరిస్థితి ఏర్పడింది. అది సవ్యంగా జరిగితేనే డబ్బులు ఇస్తామని బ్యాంకులు తేల్చి చెప్పేశాయి. బ్యాంకులతో ఏర్పడిన చిక్కుముడికి తానే కారణమన్న విషయాన్ని అశోక్, కరస్పాండెంట్ కేవీఎల్ రాజు రాజకోట రహస్యం చేసేశారు. జీతాలు నిలిచిపోవడానికి కారణం ఈఓనే అంటూ ఉద్యోగులను ఉసిగొల్పడం గమనార్హం.
జీతాల చెల్లింపు మా పరిధి కాదు...
నిబంధనల మేరకు ట్రస్ట్‌లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా బోర్డు ఆమోదం తప్పనిసరి. విద్యాసంస్థల జీతాల చెల్లింపు అంతా కరస్పాండెంట్ చూస్తున్నారు. ఈఓగా కేవలం నిధుల కేటాయింపు వరకే చూస్తాం. బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకూ జరగలేదు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బోర్డు సమావేశం గురించి మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కొత్త సీఎఫ్‌ఓ ఎవరో ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. కరస్పాండెంట్, సీఎఫ్‌ఓ సంతకాలు చేస్తేనే బ్యాంకుల నుంచి ఉద్యోగులకు జీతాల సొమ్ము విడుదల అవుతుంది.
– డి.వెంకటేశ్వరరావు, ఈఓ, మాన్సాస్ ట్రస్టు
Comments
Please login to add a commentAdd a comment