ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాల చెల్లింపు ఓ చరిత్ర: డిప్యూటీ సీఎం భట్టి
ఎర్రుపాలెం: ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఈనెల ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందించామని, రాష్ట్రంలోని 3.65 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2.85 లక్షల మంది పెన్షన్‌దారులకు వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. 2019 ఆగస్టు నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చిన చరిత్ర లేదని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరమ్మ రాజ్యం వచ్చాకే ఇది సాధ్యమైందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఉద్యోగులు సైతం పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని చెప్పారు.
ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, ఆరు గ్యారంటీల అమలులో అలసత్వం లేకుండా పనిచేయాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాల కోసం టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని, 3 నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. గ్రూప్–1, డీఎస్సీ తదితర నోటిఫికేషన్లు కూడా జారీ చేశామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్‌లో అద్భుతమైన స్టూడియో నిర్మించి నిష్ణాతులైన అధ్యాపకులతో టైమ్ టేబుల్ ప్రకటించి నిరుద్యోగులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. భట్టి వెంట ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment