సాక్షి, హైదరాబాద్: విభజనకు రెండు రోజుల ముందే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ చెల్లించేందుకు ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. సాధారణంగా వేతనాలు, పెన్షన్ ఒకటో తేదీన చెల్లిస్తారు. జూన్ 2న రాష్ట్ర విభజన జరగనుంది. మే 31 శనివారం, జూన్ 1 ఆదివారం వస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి.
ఈ నేపథ్యంలో మే 31న రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలను, పెన్షన్‌దారులకు పెన్షన్ల చెల్లింపులను పూర్తిచేయాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు బకాయిలు ఉండరాదని ఆర్థికశాఖ నిర్ణయించింది. జూన్ 2నుంచి రెండు ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నందున ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఆయా రాష్ట్రాలకు పంపిణీ అవుతారు. అంటే జూన్ నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆర్థికశాఖ సిద్ధం చేసింది. త్వరలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇందుకోసం ఆర్థికశాఖ ఏప్రిల్‌లో పెద్ద మొత్తంలో అప్పు చేయనుంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని పనులకు విభజనకు ముందే చెల్లింపులు చేయాలని యోచిస్తున్న ఆర్థికశాఖ అందుకు ఎన్ని నిధులు అవసరమవుతాయనే విషయంపై దృష్టి సారించింది. పనులు పూర్తిచేసి బిల్లుల రూపంలో ఉన్న వాటికైనా ఎన్ని నిధులు అవసరమవుతాయో అంచనా వేసి వాటినైనా చెల్లించాలని భావిస్తోంది. విభజన అనంతరం ఏ ప్రాంతంలో పనులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లింపులు చేస్తాయని, ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పనులు జరిగి బిల్లు ప్రభుత్వానికి సమర్పించి ఉన్నా వాటిని చెల్లించాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.