2023–24 ఆర్థిక ఏడాది ప్రాథమిక అకౌంట్స్ వెల్లడించిన కాగ్
బడ్జెట్ అంచనాలను మించిన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ అకౌంట్స్ తెలిపాయి. 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్‌ను కాగ్ వెల్లడించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం చేసినట్లు పేర్కొంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. అలాగే, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్ కేటాయింపులకు మించి అయినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి.
2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఉద్యోగుల వేతనాల కోసం రూ.50,882 కోట్లు కేటాయించగా రూ.52,010 కోట్లు వ్యయం అయ్యాయని, పెన్షన్ కోసం బడ్జెట్‌లో రూ.21,183 కోట్లు కేటాయించగా రూ.21,694 కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది. సామాజిక రంగం వ్యయంలో (విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) రూ.1,10,375 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు, ఆర్థిక సేవలకు రూ.57,344 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. 2023–24 ఆర్థిక ఏడాది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 91.97% వ్యయం చేసినట్లు తెలిపింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు రూ.–37,468 కోట్లు ఉండగా ద్రవ్య లోటు రూ.–61,765 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది,
గత ఐదేళ్ల బడ్జెట్‌లో మూల ధన వ్యయం ఇలా..
ఆర్థిక ఏడాది మూల ధన వ్యయం (రూ.కోట్లలో)
2019–20 17,601
2020–21 20,690
2021–22 18,511
2022–23 7,581
2023–24 23,589
మొత్తం రూ. 87,972
Comments
Please login to add a commentAdd a comment