లావేరు : విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా, విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు ప్రీ మాన్‌సూన్ ఇన్‌స్పెక్ష న్ (పీఎంఐ) పనులు చేపట్టేందుకు జిల్లాకు రూ.15 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఈపీడీసీఎల్ ఆపరేషన్ కార్పొరేట్ విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. లావేరు మండలంలో జరిగిన పీఎంఐ పనులను పరిశీలించేందుకు గురువారం ఆయన లావేరు, వెంకటాపురం గ్రామాలను సందర్శించారు. లావేరులోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లి రికార్డులు, రీడింగ్ పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద గాలులు వీచినప్పుడు, వర్షాలు పడినప్పుడు ఎక్కువగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, ఆ సమస్యలను అధిగమించేందుకు పీఎంఐ పనులు చేపడుతున్నామని తెలిపారు. విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్లు కొట్టడం, కొత్త విద్యుత్ స్తంభాలు వేయడం, పాడైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు వంటివి ఈ పీఎంఐ నిధులతో చేపడతామన్నారు.
రైతులకు పగటి విద్యుత్
రైతులకు 7గంటల విద్యుత్‌ను పగలు సమయంలో మాత్రమే ఇస్తామన్నారు. ఒక వారం ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు, మరో వారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తామని తెలిపారు. ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన’ ద్వారా కొత్తగా విద్యుత్ సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం లేని శివారు ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఈపీడీసీఎల్ శ్రీకాకుళం డివిజన్ ఏడీ మధుకుమార్, లావేరు మండల సబ్ ఇంజినీర్ శంకరరావు, లైన్‌మన్ శ్రీను ఉన్నారు.
ఏఈ సస్పెన్షన్
లావేరు విద్యుత్ ఏఈ డాంబికారావును విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో సస్పెండ్ చేశామని శ్రీనివాసమూర్తి తెలిపారు. కొత్త ఏఈని త్వరలో నియమిస్తామని తెలిపారు. లావేరులో 15 గ్రామాలకు ఒక్కరే విద్యుత్ లైన్‌మన్ ఉన్న విషయాన్ని ప్రస్తావించగా సిబ్బందిని, త్వరలోనే నియమిస్తామన్నారు.
పీఎంఐ పనులకు జిల్లాకు రూ.15 కోట్లు
Published Fri, Sep 4 2015 12:01 AM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM
Advertisement
Advertisement