
జాగ్రత్తలు తీసుకున్నాం - భయపడవద్దు : సీఎం కిరణ్
హైదరాబాద్ : పై-లిన్ తుపాన్ చాలా పెద్ద తుపానుగా చెబుతున్నారని, దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, ఎవరూ భయబ్రాంతకు లోనుకావద్దని కోరారు. ఇప్పటి వరకు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. తీరానికి చేరని బోట్లు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందిందని చెప్పారు. వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైర్లెస్ సెట్లు, హ్యామ్ రేడియోలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మంత్రులు ఆయా జిల్లాలలోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారని, అన్ని జిల్లాలలో పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమించినట్లు వివరించారు.
తుపాను వేగం గురించి గానీ, తీరం దాటే ప్రదేశంపైన గానీ ఏకాభిప్రాయంలేదని చెప్పారు. వీటిపై ఖచ్చిమైన అంచనాలు ఏవీలేవన్నారు. తుపాను వల్ల ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కొబ్బరి, జీడిమామిడి తోటలకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. తుపాను వల్ల తక్కువ నష్టం జరగాలని ప్రార్ధిద్దాం అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బలవంతంగా తరలించే పరిస్థితి తీసుకురావద్దని కోరారు. 22 మత్స్యకారుల బోట్ల జాడ ఇంకా తెలియలేదని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అన్ని రకాల వసతి కల్పించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరమైన హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతున్నామని సీఎం చెప్పారు.