విభజన తుపానును అడ్డుకుంటాం: కిరణ్
విభజన తుపానును అడ్డుకుంటాం: కిరణ్
Published Mon, Oct 21 2013 1:46 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
ప్రకృతి విపత్తు అయిన పై-లీన్ తుపానును ఆపలేకపోయాం గానీ.. అంతకంటే తీవ్రమైన రాష్ట్ర విభజన తుపానును అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కవిటిలో తుపాను బాధిత రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కొబ్బరి రైతులు తమ కష్టాలు చెప్పిన తర్వాత ఆయన మాట్లాడేందుకు ఉపక్రమించారు. అంతలో సభలో ఉన్న కొందరు వ్యక్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ, ఈ అంశంపై మాట్లాడాలని కోరారు. దీనిపై మాట్లాడేందుకు ఇది తగిన సందర్భం కాదని తొలుత నిరాకరించిన సీఎం.. అంతలోనే ఒక్క ముక్క మాట్లాడతానంటూ ‘‘పై-లీన్ తుపాను బీభత్సాన్ని అడ్డుకునే శక్తి మనకు లేదు. దాన్ని అడ్డుకోలేకపోయినా.. రాష్ట్ర విభజన తుపానును మాత్రం అడ్డుకుని తీరతాం’’ అని అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఇందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కొబ్బరి ఇన్‌పుట్ సబ్సిడీ పెంచాలని యోచిస్తున్నాం
పై-లీన్ తుపాను తాకిడి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు రూ.40 కోట్ల ప్యాకేజీ ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఇచ్ఛాపురంలో విలేకరులతో మాట్లాడారు. తుపాను ప్రభావిత గ్రామాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా లేదని తెలిపారు. ఇళ్లు నష్టపోయినవారికి ఐఏవై కింద ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు చెప్పారు. తుపాను దెబ్బతో సుమారు 880 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి, 7 గ్రామాలు మినహా అన్ని ప్రాంతాలకు సరఫరా పునరుద్ధరించారని వివరించారు.
నీటి పథకాలు దెబ్బతిన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మత్స్యకార కుటుంబాలకు ఇప్పటికే పది కేజీల చొప్పున బియ్యం అందించామని, కలెక్టర్ సలహా మేరకు అదనంగా మరో 30 వేల మంది స్వదేశీ మత్స్యకారులకు బియ్యం సరఫరా చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. కొబ్బరి రైతుకు తీవ్రనష్టం జరిగిందని, పదేళ్ల పాటు ఈ నష్టం కొనసాగుతుందని, నష్టం అంచనాలు పూర్తయ్యాక ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఇన్‌పుట్ సబ్సిడీ చెట్టుకు రూ.150గా ఉందని, దీన్ని పెంచే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొబ్బరి మొక్కలు వేసుకునేందుకు వీలుగా ఎకరాకు రూ.5 వేలు ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఇస్తామని ప్రకటించారు. తుపాను సమయంలో జిల్లా అధికార యంత్రాంగం చక్కగా పనిచేసిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులు కూడా విధుల్లో చేరి ఎనలేని సేవలందించారన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సమర్థంగా వ్యవహరించారని, మీడియా కూడా మంచి పాత్ర పోషించిందని కితాబిచ్చారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు జుత్తు జగన్నాయకులు, కొర్ల భారతి, మీసాల నీలకంఠం, బొడ్డేపల్లి సత్యవతి, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
సమైక్యవాదిపై పోలీసు జులుం
ముఖ్యమంత్రి రాక సందర్భంగా విశాఖ విమానాశ్రయం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సమైక్యవాదులపై జులుం ప్రదర్శించారు. శ్రీకాకుళం పర్యటన కోసం సీఎం కిరణ్ ఆదివారం విశాఖ విమానాశ్రయానికి చేరుకునే సమయానికి సమైక్యవాదులు అక్కడకు తరలివెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ముందు వారిని వారించిన పోలీసులు.. అనంతరం ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకుడు పల్లా పెంటారావు నోరునొక్కి ఈడ్చుకెళ్లారు. జీపు ఎక్కించి, ఎయిర్‌పోర్ట్ జోన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు డాక్టర్ జహీర్ అహ్మద్, సమన్వయకర్తలు గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు, ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆయన్ను విడిచిపెట్టాలని కోరడంతో పోలీసులు పెంటారావును వదిలిపెట్టారు.
Advertisement
Advertisement