
గర్భశోకం
సాలూరు రూరల్: గిరిశిఖర గ్రామాల ప్రజలు శాపగ్రస్థులవుతున్నారు. ఆ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న పాలకులు, అధికారుల మాటలు నీటిమూటలవుతున్నాయి. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోవడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాహన రాకపోకలకు కూడా అక్కడివారు నోచుకోలేకపోతున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక అడవిబిడ్డలు మృత్యువాత పడుతున్నా అధికారులు, పాలకుల్లో చలనం రావట్లేదు. తాజాగా ఓ గర్భిణికి సకాలంలో వైద్యం అందక పురిటిలోనే బిడ్డను కోల్పోయింది.
మండలంలోని జిల్లేడువలస పంచాయతీ నారింజపాడుకు చెందిన గర్భిణి పాలిక రమణమ్మకు ఆదివారం మధ్యాహ్నం పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో భారీ వర్షం పడడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. మంత్రసానులు వచ్చి ప్రసవం చేసేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం డోలీ కట్టి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం రాళ్లు తేలిన రోడ్డుపై నడుచుకుంటూ కరాడవలస చేరుకున్నారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో సాలూరు సీహెచ్‌సీకి వెళ్లారు.
స్పందించిన పీఓ
గర్భిణి అష్టకష్టాలు పడుతూ ఆస్పత్రికి వస్తుందన్న విషయం తెలుసుకున్న పార్వతీపురం ఐటీడీఏ పీఓ లక్ష్మీషా ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు. తీరా ఆస్పత్రికి చేరుకున్న గర్భిణి రమణమ్మకు స్థానిక వైద్యులు ప్రసవం జరిపగా మగబిడ్డ జన్మించాడు. అయితే బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో వెంటనే విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం ఉంటే సకాలంలో ఆస్పత్రికి తెచ్చేవారమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కడుపుకోత ఎవరు తీరుస్తారంటూ కన్నీరుమున్నీరయ్యారు.