ఓపీ కేంద్రంలో ఇచ్చిన వరుస నంబర్ టోకెన్లు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు వి.సూర్యకళ. రాజమహేంద్రవరం మల్లికార్జున నగర్‌కు చెందిన ఈమె నెలల గర్భిణి. సాధారణ చెకప్ కోసం బుధవారం ఉదయం తొమ్మిదిగంటలకు ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఓపీ రాయించుకుని డాక్టర్ ఉండే గది వద్ద వరుసలో నిల్చుంది. డాక్టర్ వచ్చి కొంత మంది గర్భిణులను చూసిన తర్వాత.. నర్సు వచ్చి ఇక్కడ కాదు మరో గది వద్దకు వెళ్లాలని సూచించింది. రెండు గంటల సేపు అక్కడ నిలుచున్న సూర్యకళ హడావుడిగా రెండో డాక్టర్ ఉన్న గది వద్దకు వెళ్లి అక్కడ మరో రెండు గంటలు నిల్చుంది. డాక్టర్ గదిలోకి వెళ్లేందుకు గర్భిణులు, వారి తరఫున వచ్చిన వారు తోసుకోవడంతో సొమ్మసిల్లి కింద పడిపోయింది.సూర్యకళే కాదు.. ఆమెలానే ఎంతో మంది రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాస్పత్రికి వచ్చే గర్భిణుల పరిస్థితి ఇలాగే ఉంది.
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, పోలవరం, జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గర్భిణులు వస్తున్నారు. ప్రతి రోజూ సరాసరి 200 మంది గర్భిణులు వైద్యం కోసం ఇక్కడకు వస్తున్నారు. 200 మందిని పరీక్షించి, అవసరమైన పరీక్షలు, స్కానింగ్ రాసేందుకు వైద్యలు లేక కాబోయే తల్లులు తల్లడిల్లిపోతున్నారు. అధునాతన భవనం కట్టినా అవసరమైన సౌకర్యాలు, డాక్టర్లు, సిబ్బందిని నియామకాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ప్రధాన డాక్టర్‌తోపాటు మరో డాక్టర్ బదిలీ కావడం, మరో డాక్టర్ దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో గర్భిణులకు కష్టాలు మరింత పెరిగాయి. ముగ్గురు జూనియర్ డాక్టర్లే ఇప్పుడు దిక్కయ్యారు. స్కానింగ్ డాక్టర్ పోస్టు కూడా ఖాళీ ఉంది. అమలాపురంలో పని చేసే డాక్టర్‌ను ఇక్కడికి పిలిపించి స్కానింగ్ చేయిస్తున్నారు.
సరైన వ్యవస్థ ఏదీ..?
మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపీ రాస్తున్నారు. వచ్చిన వారికి వచ్చినట్టుగా వరుస క్రమంలో ఓపీ రాసి నంబర్‌తో టోకెన్ ఇస్తున్నారు. కానీ అది ఎందుకూ పనికిరావడంలేదు. టోకెన్ నంబర్లు ఇచ్చినా డాక్టర్ గది వద్ద అది అమలు కావడంలేదు. డాక్టర్ గదిలోని సిబ్బంది టోకెన్ ప్రకారం గర్భిణులను పిలవడంలేదు. ఫలితంగా ఎవరికి వారు డాక్టర్ గది తలుపు వద్ద తాము ముందు వెళ్లాలంటూ గర్భిణులు తోసుకుంటున్నారు. గర్భిణులతోపాటు వారికి సహాయంగా వచ్చిన వారు గది ఎదుట నిల్చొని ఉండడంతో తోపులాటలు జరుగుతున్నాయి. కొంత మంది గర్భిణులను లోపలికి తీసుకెళ్లిన తర్వాత సిబ్బంది తలుపులు మూసేస్తున్నారు. ఆ తర్వాత మరికొద్ది మందిని తీసుకెళుతున్నారు. ఫలితంగా నాలుగు నెలల నుంచి తొమ్మిది నెలల గర్భిణుల వరకు తమ వంతు కోసం డాక్టర్ గది వద్ద గంటల తరబడి నిలుచుంటున్నారు.
ఎవరి దారి వారిది...
గర్భిణులు గంటల తరబడి నిలుచోవడం వల్ల ప్రమాదమని తెలిసినా డాక్టర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. వారిని కూర్చోబెట్టి వరుస క్రమంలో పిలిచే ప్రయత్నాలు చేయడంలేదు. ప్రతి నెలా 9న ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్(పీఎంఎస్‌ఎంఏ) కింద గర్భిణులకు అన్ని రకాల పరీక్షలు, సేవల ఉచితంగా ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారు. బుధవారం 9వ తేదీ కావడంతో రోజువారీ కన్నా ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు సంఖ్య రెట్టింపైంది.
Comments
Please login to add a commentAdd a comment