కొలువుల కొలుపు  | Preparations For Replacement Of Secretariat Posts In Nellore District | Sakshi
Sakshi News home page

కొలువుల కొలుపు 

Published Fri, Aug 2 2019 10:15 AM | Last Updated on Fri, Aug 2 2019 10:15 AM

Preparations For Replacement Of Secretariat Posts In Nellore District - Sakshi

జిల్లాలో కొలువుల జాతర మొదలైంది. సర్కార్‌ ఉద్యోగాల కోసం ఐదేళ్ల పాటు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన నిరుద్యోగుల్లో కొత్త ప్రభుత్వం నూతనోత్తేజాన్ని నింపింది. సర్కార్‌ చేపట్టే సంక్షేమ ఫలాలను పకడ్బందీగా అమలు చేసేందుకు అక్టోబరు 2 నుంచి  గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇందుకు సంబంధించి దేశంలో తొలిసారిగా వేలాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు రెగ్యులర్‌ విధానంలో భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వేలాది ఉద్యోగాలు తమ కళ్ల ముందు కనిపిస్తుండడంతో నిరుద్యోగులు వీటిని సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రేయింబవళ్లు చదవడమే కాకుండా పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు అవసరమైన శిక్షణ కోసం కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం వచ్చి శిక్షణ పొందుతున్నారు. దీంతో నెల్లూరులోని కోచింగ్‌ సెంటరులన్నీ నిరుద్యోగులతో కళకళలాతున్నాయి. 

సాక్షి, నెల్లూరు (టౌన్‌):   ప్రభుత్వ పౌర సేవలు అత్యున్నతంగా అందించడానికి గ్రామ సచివాలయాలు వ్యవస్థను పటిష్టంగా అమలు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో త్వరలో గ్రామ ముఖచిత్రం మారనుంది. స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వాలని దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 73, 74 రాజ్యాంగ సవరణల్లో పేర్కొన్నారు. కానీ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయడం లేదు. స్వాతంత్య్ర భారతదేశంలో తొలిసారిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇందుకు నడుం బిగించింది. అందులో భాగంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇవి భర్తీ అయితే ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా పోతుంది. తమ గ్రామాల్లోనే అవసరమైన పనులు చేసుకోవచ్చు. ప్రజల వినతులకు జవాబుదారీతనం ఉంటుంది.

జిల్లాలో 7,814 పోస్టులు 
నవరత్నాల హామీలు అమలులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి రాష్ట్రంలో 1.29 లక్షల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో భాగంగా జిల్లాలో 7,814 పోస్టులు భర్తీ కానున్నాయి. మూడు కేటగిరీల్లో భర్తీ కానున్న ఈ పోస్టుల కోసం నిరుద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

జిల్లాలో పోస్టుల వివరాలు 
పంచాయతీ సెక్రటరీలు–472, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌లు–250, మహిళా పోలీసు–925, విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌–232, విలేజ్‌ సర్వేయర్‌–665, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌–665, వార్డు ఎమినిటీస్‌–260, విలేజీ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌–537, విలేజీ హార్టికల్చరల్‌–159, ఏనిమల్స్‌ హజ్‌బెండరీ–626, ఏఎన్‌ఎం–850, విలేజీ ఫిషరీస్‌–75, డిజిటల్‌ అసిస్టెంట్‌–665, విలేజీ సెరీకల్చర్‌–3, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డాటా ప్రాసెసింగ్‌–171, వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ–260, వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ–163, వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ–171 పోస్టులు ఉన్నాయి.

కోచింగ్‌ సెంటర్లు కళకళ 
ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో కోచింగ్‌ సెంటర్లు కళకళలాడుతున్నాయి. జిల్లాలో 15 కోచింగ్‌ సెంటర్లకు పైగా ఉన్నాయి. ఉద్యోగాల సాధనకు జిల్లా నుంచే కాకుండా తిరుపతి, శ్రీకాళహస్తి, కందుకూరు తదితర ప్రాంతాల నుంచి కోచింగ్‌ సెంటర్లకు విద్యార్థులు వస్తున్నారు. ఈ పోస్టులన్నీ 3 కేటగిరీల్లో భర్తీ కానుండడంతో ఎలాగైనా ఉద్యోగం పట్టాలనే కృతనిశ్చయంతో కోచింగ్‌కు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరి నుంచి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరికి నెల పాటు కోచింగ్‌ ఇవ్వనున్నారు. ఈ అవకాశం ముందెన్నడూ రాదన్న ఆలోచనతో వేల సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగాలు పొందేందుకు కోచింగ్‌ సెంటర్లకు క్యూ కట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ చదువుకుంటున్న పరిస్థితి ఉంది.

150 మార్కులకు ప్రశ్నపత్రం 
ఈ ఉద్యోగాల భర్తీకి ఐఐటీ నుంచి డిగ్రీ, బీటెక్‌ వరకు చదువుకున్న వారు అర్హులు. కేటగిరీ–1లో మొదటి పేపరు 75, రెండో పేపరు 75 కలిపి మొత్తం 150 మార్కులకు జనరల్‌ స్టడీస్‌ ఉంటుంది. కేటగిరీ–2, కేటగిరీ–3లో మొదటి పేపరులో జనరల్‌ స్టడీస్‌ 50 మార్కులకు, సబ్జెక్ట్‌కు సంబంధించి 100 మార్కులు ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. అయితే ఈ పరీక్ష విధానంలో మైనస్‌ మార్కులు ఉంటాయి. ప్రతి 4 తప్పులకు ఒక మార్కును తగ్గిస్తారు. ఉద్యోగాలకు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు వయస్సు 42 ఏళ్ల లోపు వారు అర్హులు. ఉద్యోగాల్లో స్థానికతకు ప్రాధాన్యం ఇచ్చారు. మెరిట్‌ ప్రాతిపదికగా స్థానికులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం ఉద్యోగాలు కల్పిస్తారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. పోస్టును బట్టి వేతనం రూ.14,600 నుంచి రూ.44,870 వరకు చెల్లించనున్నారు.

మహిళలకు సువర్ణావకాశం 
గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగాలతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. చరిత్రలో వారికి ఉద్యోగ కల్పనలో సువర్ణవకాశం లభించింది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఏఎన్‌ఎం, మహిళా పోలీసు వలంటీర్, సంక్షేమ సహాయకుల పోస్టులను పూర్తిగా కేటాయించారు. వీటితో పాటు మిగిలిని అన్ని ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్‌ ఉంది. దీంతో పాటు ఓపెన్‌ కేటగిరీల్లోనూ మహిళలు పోటీ పడవచ్చు.

చాలా ఆనందంగా ఉంది
పెద్ద మొత్తంలో పోస్టులు భర్తీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. కొద్దిగా కష్టపడితే ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం.
– తిరుపతి రవికుమార్, దగదర్తి

మహిళలకు మంచి అవకాశం
సచివాలయ ఉద్యోగాల భర్తీలో మహిళలకు మంచి అవకాశాలు కల్పించారు. ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా మహిళలకు ఎన్నో ఉద్యోగావకాశాలు కల్పించారు. మహిళలకు ఇది సువర్ణావకాశం. 
– జి.లీనా, నెల్లూరు

పోస్టుల భర్తీ అభినందనీయం
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1.29 లక్షల ఉద్యోగాలు కల్పించడం అభినందనీ యం. ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. దేశ చరిత్రలో ఇన్ని ఉద్యోగాలు ఎప్పు డూ కల్పించలేదు. – ఎస్‌.బ్రిజిత, చిల్లకూరు

చరిత్రలో సువర్ణాధ్యాయం
దేశ చరిత్రలో ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించడం సువర్ణాధ్యాయం. పోస్టుల భర్తీ వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్రామ సచివాలయాల వల్ల మండల కార్యాయాలకు వెళ్లకుండా గ్రామ పరిధిలోనే సమస్యలను పరిష్కరించకోవచ్చు.
– హరిబాబు, శ్రీహర్ష కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు

లక్షలాది నిరుద్యోగులకు లబ్ధి
ఉద్యోగాల భర్తీతో లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని చేపట్టలేదు. ఇదో మంచి అవకాశం. ఉద్యోగాలకు ఎంపికైన వారిని రెండేళ్లలో రెగ్యులర్‌ చేస్తామని చెప్పడం అభినందనీయం.
– షణ్ముఖాచారి, శ్రీహర్ష కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement