- నేడు మంత్రివర్గం సమావేశం ముందుకు..!
- వివాదాస్పద జీవో 64 రద్దు నేపథ్యంలో కౌన్సిల్‌ను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం
- మెడికల్, వెటర్నరీ కౌన్సిల్ తరహాలో రాష్ట్ర అగ్రికల్చరల్ కౌన్సిల్
- తెరమరుగు కానున్న జీవో నంబర్ 16
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన రాష్ట్ర వ్యవసాయ విద్యా మండలి విధివిధానాలపై ముసాయిదా సిద్ధమయ్యింది. శనివారం జరిగే రాష్ట్ర మంత్రివర్గం భేటీలో ఈ ముసాయిదా చర్చకు రానున్నట్టు తెలిసింది. వ్యవసాయ విద్యా సంస్థల గుర్తింపు, ప్రమాణాలకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇటీవల జారీ చేసిన వివాదాస్పద జీవో 64ను రద్దు చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ విద్యా మండలి ఏర్పాటుకు తెరదీసింది. సర్కారు ఆదేశాలతో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు ప్రముఖులతో ఓ కమిటీని నియమించారు.
మండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కమిటీ ఇటీవల భేటీ అయి వ్యవసాయ మండలి విధివిధానాలపై ముసాయిదాను తయారు చేసింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, వెటర్నరీ కౌన్సిల్ తరహాలో రాష్ట్ర అగ్రికల్చరల్ కౌన్సిల్ ఉంటుంది. ప్రస్తుత ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఆ తర్వాత గెజిట్ వెలువడుతుంది. దీంతో గత 17 ఏళ్లుగా అమల్లో ఉన్న జీవో నంబర్ 16 తెరమరుగవుతుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న.. ‘భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) అక్రిడిటేషన్ ఉన్న సంస్థల్లో చదివిన వారికే రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు’ అనే నిబంధన రద్దవుతుంది. రాష్ట్ర వ్యవసాయ విద్యా మండలి నిర్ణయాలే చెల్లుబాటవుతాయి. విద్యా సంస్థలపై నియంత్రణ కూడా వ్యవసాయ మండలికే ఉంటుంది.
ఇదీ నేపథ్యం...
జీవో 16 మేరకు.. ఐసీఏఆర్ అక్రిడిటేషన్ ఉన్న వ్యవసాయ విద్యా సంస్థల్లో చదివిన వారికే రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు వస్తున్నాయి. విద్యా ప్రమాణాలను సైతం ఐసీఏఆర్ ఖరారు చేస్తుంది. దానికనుగుణంగా ప్రభుత్వం జీవో 16ను తీసుకువచ్చింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2000 సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఆ తర్వాత కొందరు ఇతర రాష్ట్రాల్లోని విద్యా సంస్థల పట్టాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు పొందారు.
వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 64 తెచ్చింది. దీంతో తమకు అన్యాయం జరుగుతుందంటూ రాష్ట్ర విద్యార్థులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వ్యవసాయ విద్యా మండలి ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మండలి ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలలో చదివిన వారు కూడా మన రాష్ట్రంలో కొన్ని మినహాయింపులతో ఉద్యోగాలు పొందేందుకు అర్హులవుతారని తెలిసింది. ఐసీఏఆర్ చట్టబద్ధమైన సంస్థ కాదని అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యా మండలి ఏర్పాటుకు ముందుకు వచ్చిందని ముసాయిదా తయారీ కమిటీ సభ్యుడొకరుచెప్పారు.
ముసాయిదా ఇలా...
మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో ఇప్పటికే వ్యవసాయ విద్యా మండళ్లు ఉన్నాయి. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా మండలిని తీసుకురాదలచింది. వాస్తవానికి ఇదో నియంత్రణ సంస్థ. వ్యవసాయ, ఉద్యాన, హోం సైన్స్ గ్రాడ్యుయేట్లు వ్యవసాయ విద్యామండలి పాలక వర్గాన్ని ఎన్నుకుంటారు. ఇందుకోసం ఇప్పటికే డిగ్రీలు పొందిన వ్యవసాయ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వీళ్లందరూ కలిసి 20 మందిని ఎన్నుకుంటారు. అధ్యక్షుణ్ణి ప్రభుత్వం నియమిస్తుంది. ఉపాధ్యక్షుణ్ణి పాలక మండలి సభ్యులుగా ఎన్నికయిన వారు ఎన్నుకుంటారు.
వీళ్లతో పాటు కమిటీలో వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్శిటీలు, ఐసీఏఆర్, వ్యవసాయ శాఖ నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతినిధులు ఉంటారు. మండలికి ఎంత కాలానికోసారి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. ప్రస్తుత ముసాయిదా ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఎవరైనా వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. మండలి సభ్యులు ప్రతిపాదిత కళాశాలలో నిబంధనల ప్రకారం భూమి, భవనాలు, ఇతర సౌకర్యాలు, ప్రయోగశాల, బోధనా సిబ్బంది వంటివి ఉన్నాయో లేవో పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. మండలి సిఫారసులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.