‘సాగు’ చతికిల | prepared zone -2 irrigated to rabi | Sakshi
Sakshi News home page

‘సాగు’ చతికిల

Published Mon, Sep 8 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

prepared zone -2 irrigated to rabi

సాక్షి, ఒంగోలు: ఖరీఫ్ సీజన్ దాదాపు ముగిసినట్లే.. ఇక, వచ్చే అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు ఇప్పట్నుంచి సాగు సన్నాహాలు చేసుకోవాలనే ఆలోచనలో రైతులున్నారు. ఈ తరుణంలో వారికి ప్రభుత్వ సాయం ప్రశ్నార్థకమైంది. రుణమాఫీ అమలుపై స్పష్టత ఇవ్వకుండా.. కొత్తరుణాలు అందించడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరిపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.  

 జోన్-2కు విడుదల చేయనున్న సాగునీరు సక్రమంగా కాలువలకొస్తే..పైర్లు వేసుకునే అవకాశం ఉందని..ప్రస్తుత ఖరీఫ్ తమకు అచ్చిరాలేదని రైతులంటున్నారు. ఈ ఏడాది మే నెలలోనే పలకరించాల్సిన తొలకరి జల్లు జూన్ ఆఖరుకు వచ్చినా..కొన్నిచోట్ల జాడే లేదు. ఆగస్టులో అక్కడక్కడా చిరుజల్లులు పడినా..భూమి తడిసేంత మేరకు చినుకులు కురవలేదు.

అదునులేని పదునెక్కడంటూ సాగుపై ఆశలు సన్నగిల్లిన రైతులు ఉసూరుమన్నారు.జిల్లావ్యాప్తంగా సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో సుమారు 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవ్వాల్సి ఉంది. తొలకరి పంటలైన సజ్జలు, నువ్వులు, పెసర్లు, ఇతర పశుగ్రాస పంటలు కలిపి సుమారు లక్ష ఎకరాల్లో సాగుచేయాల్సి ఉన్నా.. రైతులు వాతావరణ ప్రతికూలత నేపథ్యంలో చేతులెత్తేశారు.

 నేటికి సాగుబడిలోకొచ్చింది 40 శాతమే..
జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 6 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికీ 40 శాతం కూడా సాగులోకి రాలేదు. సీజన్ ముగిసే నాటికి 2.5 లక్షల ఎకరాల్లోనే సాగు మించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో అత్యధికశాతం విస్తీర్ణంలో మెట్టపంటలు సాగువుతుండగా, ఈసారి వర్షాభావం ప్రతిబంధకంగా మారింది.  మాగాణి రైతుల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.

ఈసారి జోన్-2 ప్రాంతాలకు సాగునీరు వస్తేనే వరినాట్లు ఇప్పుడు వేసి రబీ ఆరంభం నుంచి ఇతర మాగాణి పంటలు వేద్దామనే ఆలోచనలో ఉన్నారు. వరి విత్తనాలకు ప్రభుత్వ రాయితీ లేనుందున .. రైతులే ఆర్థికంగా భారం భరించి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. మిగతా పంటల విత్తనాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం నడుస్తున్నప్పటికీ.. విత్తన కొరత సమస్యగా మారింది.

 శనగపంటకు సంబంధించి విత్తనాల కొరత తీవ్రంగా ఉంది. కనిగిరి, పీసీపల్లిలో మినుము విత్తనాల కోసం రైతులు రేయింబవళ్లు మనగ్రోమోర్ కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. ఖరీఫ్ ఆరంభం నుంచి ఇప్పటి దాకా వ్యవసాయశాఖ తరఫున రైతులకు ఒక్క అవగాహన కార్యక్రమమూ నిర్వహించలేదు.  వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలసాగుపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి రైతుల్లో అవగాహన చేయాల్సిన అధికారులు మిన్నకున్నారు.  

తక్కువ ఎరువుల వాడకం.. తక్కువ నీటితో అధిక దిగుబడి వచ్చే పద్ధతులు వివరించడం.. ప్రభుత్వ పథకాలు సద్వినియోగమయ్యేలా ప్రణాళికలు రూపొందించడం.. బ్యాంకర్లతో చర్చించి లక్ష్యం మేరకు పంట రుణాలందే ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేయలేని దుస్థితిలో జిల్లా వ్యవసాయశాఖ ఉంది.
 
బ్యాంకు నోటీసులతో బెంబేలు...
ఖరీఫ్ సాధారణ కందిసాగు విస్తీర్ణం 57,219 హెక్టార్లు కాగా, 33,490 హెక్టార్లలో మాత్రమే సాగైంది. పత్తి 56,217 హెక్టార్ల గాను 42,884 హెక్టార్లలో వేశారు. మిర్చి 16,774 హెక్టార్లు సాధారణ సాగువిస్తీర్ణమైతే..1808 హెక్టార్లలో మాత్రమే ఇప్పటికీ సాగైంది.

ఇక పెసర, సజ్జ, నువ్వు వంటి తొలకరి పైర్లతో పాటు ఇతర ప్రధాన పంటలైన ఆముదం, మొక్కజొన్న వంటి పంటలు సగం విస్తీర్ణంలో కూడా సాగవ్వలేదు. అదేవిధంగా వరిసాగు అసలు మొదలవలేదు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 39,363 హెక్టార్లు కాగా, కిందటేడాది 58,034 హెక్టార్లలో సాగైంది. జోన్-2 సాగునీటితో పాటు వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే ప్రస్తుత సీజన్ ముగిసేలోపు 15,230 హెక్టార్లలో నాట్లు పడొచ్చని అధికారులు చెబుతున్నారు.

బ్యాంకర్లు మాత్రం ప్రభుత్వం పంటరుణాల మాఫీపై ప్రకటనలతో సంబంధం లేకుండానే బంగారం తాకట్టు పెట్టిన లబ్ధిదారులకు వేలం నోటీసులు జారీ చేస్తున్నారు. ఖరీఫ్ కొత్తరుణాల ఊసే ఎత్తకూడదంటూ ..పాతబాకీలకు రికవరీ నోటీసులతో బెంబేలెత్తిస్తున్నారు. కొత్తప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే రైతుల పరిస్థితి ఇలాగుంటే.. ఇక, భవిష్యత్ ప్రశ్నార్థకమేనంటున్నారు రైతు సంఘాల నేతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement