సాక్షి, ఒంగోలు: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో జిల్లా రైతులు విత్తన విపత్తు ఎదుర్కొంటున్నారు. రైతులు ఇప్పట్నుంచే పొలాలపక్కన కుంటల్లో పూడిక తీసుకోవడం.. దుక్కులు దున్నుకోవడం..తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. ఈనెల రెండోవారంలో రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయనే వాతావరణ కేంద్రం సూచనలతో అదునులో పదునైతే తొలకరి పంటల సాగుకు సిద్ధమయ్యారు. అయితే, సకాలంలో అందుబాటులో ఉండాల్సిన విత్తనాల నిల్వలే.. ఇప్పుడు వారికి సమస్యగా మారాయి.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5.34 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ముందే వర్షాలు కురవడంతో సాగు అనుకూలించింది. 6.75 లక్షల ఎకరాల్లో విత్తనాలు నాటి సాగు చేశారు. ఈఏడాది కూడా ఆశాజనకంగానే ఉంటుందనేది అధికారుల భావన. రైతులు ఇప్పటికే విత్తన కొనుగోలుపై దృష్టిపెట్టారు. వ్యవసాయశాఖ మాత్రం వర్షాధార పంటలైన చిరుధాన్యాల విత్తనాల్ని మాత్రమే అందుబాటులో ఉంచి.. జిల్లా ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప, వేరుశనగ విత్తనాలకు సంబంధించి ముందస్తు జాగ్రత్తపడలేదు. మిగతా జిల్లాలతో పోల్చితే, ప్రకాశంలో ఖరీఫ్ ఆలస్యంగా ప్రారంభమవుతోందని..అందుకే విత్తన నిల్వలపై పెద్దగా తొందరపడటం లేదనేది వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతుల్లో మాత్రం ప్రధానపంటల విత్తనాల పంపిణీపైనే ఆందోళన నెలకొంది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
{పస్తుతం వేసవి పత్తి 18,562 ఎకరాలతో కలిపి ఇప్పటికే మిగతా పంటలన్నీ మొత్తం 20,905 ఎకరాల్లో సాగవుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే.. జిల్లాలో ఈ ఏడాది కంది, పత్తి సాగు పెరుగుతోందనేది వ్యవసాయశాఖ అంచనా. దీనికి అనుగుణంగా రెండురకాల విత్తనాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది.
పత్తి గతేడాది అంచనా (1.19 లక్షల ఎకరాల)కు మించి 1.78 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ మేరకు ఎకరాకు రెండు సంచుల చొప్పున చూపినా.. హెక్టారుకు ఐదు సంచులు అవసరం. అంటే కనీసం, 3.57 లక్షల సంచుల విత్తనాలు కావాల్సి ఉంది. ఇప్పటిదాకా 53,110 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మిర్చిసాగు కూడా ఏడాదికేడాదీ పెరుగుతోంది. మిర్చి సాధారణ విస్తీర్ణం 38,480 ఎకరాలకు గాను గతేడాది 50,077 ఎకరాల్లో సాగుచేశారు. గుండ్లకమ్మ పరిధిలో నీటివసతి ఆధారంగా రైతులు మిరపసాగుకు మొగ్గుచూపుతున్నారు. వీరికి ఎన్ని విత్తనాలు అవసరమో కూడా వ్యవసాయశాఖ ఇప్పటి వరకు అంచనా వేయకపోవడం గమనార్హం.
కిందటేడాది అదునులో సాగునీరు ఇవ్వడంతో 93,107 ఎకరాలకు గాను 1.45 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. ప్రస్తుతానికి ఆరువేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే ఏపీసీడ్స్ వద్ద అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి సీజన్ ముమ్మరంగా సాగేక్రమంలో ఇంకా విత్తనాలు తెప్పిస్తామంటున్నారు.
వేరుశనగ పంటకు సంబంధించి జిల్లాకు 3 వేల క్వింటాళ్ల విత్తనాలు కేటాయించగా, వాటి సేకరణ బాధ్యత తీసుకున్న ఏపీసీడ్స్ దగ్గర నిల్వల్లేవు. ఎప్పటికొస్తాయనే సమాచారం కూడా లేదు.
పలు విత్తనాలను రాయితీపై ఇచ్చేందుకు వ్యవసాయశాఖ సిద్ధం చేయగా, ప్రస్తుతం జొన్న 10 క్వింటాళ్లు, సజ్జ 90 క్వింటాళ్లు, మొక్కజొన్న 50 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 150 క్వింటాళ్లు, కంది 1500 క్వింటాళ్లు, నువ్వులు 110 క్వింటాళ్లు, ఆముదం 50 క్వింటాళ్లు, వేరుశనగ 3 వేల క్వింటాళ్లు, జీలుగ 700 క్వింటాళ్లు, పిల్లిపెసర 800 క్వింటాళ్లు, జనుము 300 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రణాళికపై కసరత్తు చేస్తున్నాం..
ఖరీఫ్ సాగు ప్రణాళికను రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టరేట్ కార్యాలయ మార్గదర్శకాల ప్రకారం రూపొందించాల్సి ఉంది. ఇటీవల ఎన్నికల సీజన్‌లో అధికారులంతా బిజీగా ఉన్నందున ఈసారి కాస్త ఆలస్యమైంది. అయితే, జిల్లా స్థాయిలో సాధారణ ఖరీఫ్ ప్రణాళిక రూపొందించుకుని దానిప్రకారమే విత్తనాలు సిద్ధం చేశాం. ఇంకా పలురకాల పంటల విత్తనాలు అందాల్సి ఉంది. ఖరీఫ్‌లో కంది, పత్తి, మినుము అధికంగా సాగవుతోందని అంచనా. దర్శి, త్రిపురాంతకం, తర్లుపాడు ప్రాంతాల్లో కంది సాగుపై రైతులు మొగ్గుచూపుతున్నారు. వర్షాలు కురవగానే భూమిని సారవంతం చేసుకోవడానికి జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలు రాయితీపై అందించేందుకు జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాలు అందుబాటులో ఉంచాం.
విపత్తు
Published Wed, Jun 4 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement