
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
రాజమండ్రి సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలన తుగ్లక్ పాలనను మించిందని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ విమర్శించారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ల వివాదాలు చూస్తుంటే భారతదేశంలోనే ఉన్నామా అనే అనుమానం వస్తోందన్నారు.
ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాన్ని రెండు రాష్ర్టాల మధ్య వివాదంగా మార్చేస్తున్నారన్నారు. రెండు రాష్ర్టాలలో పాలనపై దృష్టి పెట్టాల్సిన గవర్నర్ గుళ్లుగోపురాలకు తిరుగుతూ కళ్లు మూసుకున్నారని విమర్శించారు. ఆయనను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదావల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను ఏ పార్టీలోనూ లేకుండా స్వతంత్రునిగా ఉన్నానన్నారు. రాజమండ్రిలో ఎస్సీ భూముల వివాదంపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించి న్యాయం చేయాలన్నారు.