మీరు.... మీ పార్టీ 420 : హర్షకుమార్
రాజమహేంద్రవరం: ప్రతి విషయంలోను ప్రజలను, దళితులను మోసం చేస్తున్న మీరు...మీ పార్టీ 420తో సమానమని టీడీపీని, రాష్ట్ర సీఎం చంద్రబాబుని ఉద్దేశించి అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు. కొన్ని నెలల క్రితం వ్యాన్ ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి కిందపడిన ఘటనలో 22 మంది చనిపోగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్ష చొప్పున నష్ట పరిహారం అందజేశారని, ఈ నెల 18న దర్శనానికి వెళ్తూ కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.లక్ష నష్ట పరిహారం ప్రకటించడం వివక్షత కాదా అని ప్రశ్నించారు.
ఈ ఏడాది మే 23న పాత తుంగపాడులో ఒక దళితుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తులపై ఇంత వరకూ చర్యలు లేవని, ఇటీవలే ఓ మీడియా సమావేశంలో చార్జిషీటు వేసినట్టు పోలీసులు చెబుతున్నప్పటికీ రికార్డుల్లో నమోదు కాలేదన్నారు. ఇకనైనా దళితుల పట్ల వివక్షను విడనాడాలని సూచించారు. దళితుల పట్ల వివక్ష చూపిస్తున్న చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పరమట గణేశ్వరరావు, జీవీ శ్రీరాజ్, ఒరిగేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.