- స్పీకర్ కోడెల వైఖరికి నిరసనగా రెండో రోజూ అసెంబ్లీని బహిష్కరించి నిరసన తెలిపిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
- గవర్నర్‌ను కలసి పరిస్థితిని వివరించిన విపక్ష నేత వైఎస్ జగన్
- 26 నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో కలసి జగన్ బస్సుయాత్ర
- పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు కొనసాగనున్న యాత్ర
- నేడు ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు నియంత్రించడం, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఆందోళన బాట పట్టింది. సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శాసనసభా పక్షం సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించి తదుపరి కార్యాచరణను ఖరారు చేసింది. ఆ మేరకు స్పీకర్ కోడెల చర్యలను నిరసిస్తూ శాసనసభ ఆవరణలోని మహాత్మగాంధీ విగ్రహం ముందు ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. వరుసగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ఎమ్మెల్యేలు అంతకుముందు ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ చౌక్‌కు చేరుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
అక్కడి నుంచి అసెంబ్లీ ఆవరణకు పాదయాత్రగా చేరుకున్నారు. దారి పొడవునా స్పీకర్ వైఖరిని నిరసిస్తూ, చంద్రబాబు విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల ఆందోళన ఓ వైపు సాగుతూ ఉండగా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి తాజా పరిస్థితులను మరోసారి వివరించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి గల కారణాలను వివరించారు. శాసనసభలో ఏకైక ప్రతిపక్షంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాలను ఆయన గవర్నర్‌కు తెలిపారని పార్టీ వర్గాలు చెప్పాయి.
ఈ నెల 19న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై ప్రసంగిస్తూ రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండగా ‘మాట్లాడొద్దని’ మైక్ కట్ చేయడంతో సమావేశాలను జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు. ప్రతిపక్ష వాణి వినిపించకుండా స్పీకర్ తమ గొంతు నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యేలు ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియంతత్వ పోకడలు, నిరంకుశ వైఖరిపై బడ్టెట్ సమావేశాలు ముగిసే వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిర్ణయించారు. శాసనసభ ఆవరణలో మంగళవారం ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించాలని, 26 నుంచి ప్రాజెక్టుల వద్దకు బస్సుయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. బస్సు యాత్రలో జగన్, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
పోలవరం నుంచి పోతిరెడ్డి వరకు..
జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి చేసే బస్సుయాత్ర పోలవరం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు వరకు సాగుతుందన్నారు. 26న పోలవరం వెళ్లి అటునుంచి పట్టిసీమ, ప్రకాశం బ్యారేజి, ఆ తరువాత పోతిరెడ్డిపాడు వెళతారని శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ వివరించారు. శాసనసభా పక్ష సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారాల గురించి ఎండగట్టడానికి శాసనసభ ఆవరణలోనే మంగళవారం ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అసెంబ్లీలో అధికారపక్షం, స్పీకర్ కలసి ప్రతిపక్షం గొంతు నొక్కుతుండటాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారని, ప్రజల్లోకి వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించాలని శాసనసభాపక్షం భావించినందువల్లనే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తాము చేపట్టే కార్యక్రమాలు స్పీకర్‌కు, అధికారపక్షానికి కనువిప్పు కలిగిస్తాయని భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏడాదిలోపే విశ్వాసం కోల్పోయారు
అయ్యదేవర కాళేశ్వరరావు, బి.వి.సుబ్బారెడ్డి, శ్రీపాదరావు, నారాయణరావు వంటి మహానుభావులు శాసనసభలో నిష్పాక్షికంగా వ్యవహరించి స్పీకర్ పదవికే వన్నె తేవడమేగాక మంచి సంప్రదాయాలను నెలకొల్పారని, అలాంటిది ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఏడాది గడవకముందే ప్రధాన ప్రతిపక్షం విశ్వాసం కోల్పోవడం దారుణమని చెప్పారు. అధికారపక్షం కనుసన్నల్లో స్పీకర్ వ్యవహరిస్తున్నారని, మూడు శాసనసభా సమావేశాల నిర్వహణతోనే ఆయన నైజం బయటపడిందని పేర్కొన్నారు.
అందుకే తాము అవిశ్వాసం ప్రతిపాదించామని, అది గెలిచినా, ఓడినా తాము మాత్రం ఆయన తీరును ఎండగడతామని చెప్పారు. బడ్జెట్‌పై చర్చలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రైతు సమస్యల గురించి ప్రస్తావించగానే ‘మాట్లాడ్డానికి వీల్లేదు’ అంటూ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రానికే వరప్రసాదమైన పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకే చంద్రబాబు పట్టిసీమను తెరమీదకు తెచ్చారని, దీనిద్వారా జరిగే అన్యాయాన్ని తాము ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీఏసీ సమావేశాల్లో, శాసనసభలో జరిగిన అంశాలను స్పీకర్ మీడియాకు ఎలా చెబుతారని ప్రశ్నించారు.
గుంటూరులో స్పీకర్ మాట్లాడుతూ ప్రజావసరాలకు భిన్నమైనవాటిని సహించనని చెప్పారని, అసలు అలా చెప్పడానికి ఆయన ఎవరని నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని ఎన్నుకున్నట్లే ప్రజలు తమను కూడా ఎన్నుకున్నారని, తమకు ప్రతిపక్షపాత్ర ఇచ్చారని గుర్తుచేశారు. అసెంబ్లీలో సమగ్రంగా చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుని తమపై ఏకపక్షంగా రుద్దుతుంటే తాము ప్రతిఘటిస్తున్నామన్నారు. తమవి ప్రజా వ్యతిరేక చర్యలని స్పీకర్ ఎలా అంటారు? ఆయనకు ఆ అధికారం ఎక్కడిది? అని నెహ్రూ ప్రశ్నించారు. బీఏసీలో ఏమీ జరగడంలేదని, హాజరుకాగానే తమతో సంతకాలు చేయించుకుని మీ అంశాలేమిటని అడిగి తెలుసుకుని నిష్ర్కమిస్తుంటారని, అందులో ఒక నోట్ కూడా ఉండదని చెప్పారు. సభా సమయం లేదని రోజూ చెప్పే అధికారపక్షం అసెంబ్లీ సమావేశాల వ్యవధిని ఎందుకు పొడిగించదని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీ వరకు పాదయాత్ర, ఆపై ధర్నా
అధ్యక్షా.. మీరెవరి పక్షం? ప్రభుత్వ పక్షమా? ప్రజల పక్షమా?.. అని ప్రతిపక్ష సభ్యులు శాసనసభాపతిని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంతో పాటు, స్పీకర్ వైఖరికి నిరసనగా విపక్ష ఎమ్మెల్యేలు సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. పట్టిసీమ దొంగ.. బాబు దొంగ.. రైతు వ్యతిరేకి.. మహిళా వ్యతిరేకి చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ‘ప్రజా వాణే ప్రతిపక్ష వాణి..’, ప్రతిపక్షం లేకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షం గొంతు నొక్కేస్తారా..?, ప్రతిపక్షంపై ఎదురుదాడి బాబు ప్రభుత్వ సమాధానమా..! అని నిలదీశారు. ప్రభుత్వ దుశ్చర్యలకు స్పీకర్ వంతపాడుతున్నారని మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమానికి ముగింపుగా శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ ప్రణాళికబద్ధమైన విధానాలతో ముందుకు పోతుందని చెప్పారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పాదయాత్ర, ధర్నాలో ఉపనేత ఉప్పులేటి కల్పన, వంతల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణి, గిడ్డి ఈశ్వరి, గౌరు చరితారెడ్డి, విశ్వాసరాయి కళావతి, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి, కొడాలి నాని, సుజయ్‌కృష్ణ రంగారావు, కిడారు సర్వేశ్వర్‌రావు, కంబాల జోగులు, మణి గాంధీ, వరుపుల సుబ్బారావు, పి.అనిల్‌కుమార్‌యాదవ్, గొట్టిపాటి రవికుమార్, పోతులరామారావు, కిలివేటి సంజీవయ్య, కళత్తూరు నారాయణస్వామి, పాశం సునీల్‌కుమార్, ఆదిమూలపు సురేష్, తిరువీధి జయరామయ్య, ఐజయ్య, పాలపర్తి డేవిడ్‌రాజు, మేకా ప్రతాప అప్పారావు, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, జంకె వెంకటరెడ్డి, కలమట వెంకటరమణ, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, ముస్తఫా, అత్తారు చాంద్‌బాషా, షేక్ బేపారి అంజాద్‌బాషా, ముత్తుముల అశోక్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కోన రఘుపతి, కాకాని గోవర్థన్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.