ఆడవాళ్లమంటా...చీర కప్పుకొని వెళ్లాలంట..
హైదరాబాద్ : శాసనసభలో ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిపక్షంపై అధికారపక్ష ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రభుత్వంతో పాటు, స్పీకర్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం ట్యాంక్బండ్పైన అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రజా సమస్యలను గట్టిగా నిలదీస్తున్నందుకే తనపై టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారన్నారు. 'సభలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే కరెక్ట్...మేము మాత్రం ఆడవాళ్లమంటా...చీర కప్పుకొని వెళ్లాలంటా. వాళ్లనేమీ అనుకూడదట. ఇదేమీ న్యాయం' అని రోజా ప్రశ్నించారు. బోండా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు.
మంత్రి పీతల సుజాత తనను వ్యక్తిగతంగా విమర్శించినందువల్లే తాను కూడా స్పందించాల్సి వచ్చిందని రోజా అన్నారు. అసెంబ్లీ పుటేజ్ను పరిశీలిస్తే మంత్రి అన్న తర్వాతే తాను మాట్లాడానని, తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుస్తుందన్నారు. అన్యాయంపై నిలదీస్తే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటున్నారని, నిజంగా ఎవరు అన్యాయానికి గురి అవుతారో, వారికి భరోసా ఇవ్వడానికే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీసుకు వచ్చారని, అయితే ప్రస్తుతం ఈ చట్టం రాజకీయ కక్ష సాధింపుల కోసమే కుల ప్రస్తావన తెచ్చామని కేసులు పెట్టడం సరికాదన్నారు. బడ్జెట్పై సుమారు 45 రోజులు చర్చ జరగాల్సి ఉండగా, కేవలం 16 రోజులకు కుదించటం సరికాదన్నారు. తనకు అనుభవం ఉందన్న చంద్రబాబు...ఆ అనుభవాన్ని ప్రజల్ని మోసం చేయటంలో చూపిస్తున్నారన్నారు.