తేలుకుట్టిన దొంగల్లా టీడీపీ నేతలు: రోజా
హైదరాబాద్: బెజవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ వ్యవహారంపై ఏసీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంతో రెండోసారి కూడా వాయిదా పడింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. కాల్‌మనీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేల డబ్బులన్నాయిని ఆమె ఆరోపించారు. అందుకే తేలుకుట్టిన దొంగల్లా నిందితులందరూ సహకరించుకుంటున్నారని విమర్శించారు. బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్‌ను ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. అధికార పార్టీ నేతలే కాల్ మనీ సెక్స్ రాకెట్ సూత్రధారులని ఆమె చెప్పారు.
కాల్‌మనీ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ పెద్దలందరినీ బయటకు లాగాలని రోజా డిమాండ్ చేశారు. ఈ కాల్‌మనీ ఘటనతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు మహిళల బాధలు పట్టడం లేదని దుయ్యబట్టారు. ఆఫీసుకెళ్లాలంటే ఉద్యోగినులు, కాలేజీలకు వెళ్లాలంటే విద్యార్థినులు భయపడుతున్నారని వాపోయారు. వనజాక్షి, రిషితేశ్వరి కేసులను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసును అలానే చేయాలనుకుంటున్నారని రోజా విమర్శించారు.
నిందితులకు ప్రభుత్వం వంత పాడుతోంది: గౌరు చరితారెడ్డి
కాల్‌మనీ సెక్స్‌రాకెట్ నిందితులకు ఏపీ ప్రభుత్వం వంత పాడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. ఈ కాల్‌మనీ కేసులో ఉన్న టీడీపీ నేతలను వెంటనే అరెస్ట చేయాలని ఆమె డిమాండ్ చేశారు.