నన్నేకాదు..ఎన్టీఆర్, బాలయ్యను అవమానించారు
హైదరాబాద్ : అసెంబ్లీలో ఓ కళాకారిణి గురించి అనుచితంగా మాట్లాడటం బాధాకరమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. యాక్టర్ అంటూ టీడీపీ నేతలు సభలో ఛీప్గా అసభ్యంగా మాట్లాడటం సరికాదని, తనను ఒక్కదాన్నే కాదని, ఎన్టీఆర్, బాలకృష్ణను కూడా అవమానించారని ఆమె అన్నారు. టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్ కూడా కళాకారుడేనని, అలాగే బాలకృష్ణ కూడా నటుడేనని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓ ఆర్టిస్ట్ గురించి అలా మాట్లాడుతుంటే స్పీకర్ ఖండించకపోకపోగా హోల్డ్ యువర్ టంగ్ అన్నారని ఆమె అన్నారు.
సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మాట్లాడినా స్పీకర్ చర్య తీసుకోవడం లేదన్నారు. బోండా ఉమా పాతేస్తామన్నా.. బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ప్రశ్నిస్తే తననే స్పీకర్ హోల్డ్ యువర్ టంగ్ అన్నారని పేర్కొన్నారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ వీడియోలు దొంగలించి మీడియాకు విడుదల చేశారని రోజా ఆరోపించారు. శాసనసభ సభ పరువు తీసేలా ప్రవర్తించినా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ వీడియోలు తాము ఇవ్వాలేదని శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ స్పష్టం చేశారని రోజా తెలిపారు. సభలో దృశ్యాలు అసభ్యకరంగా ఉంటే అన్ని పార్టీలను పిలిచి స్పీకర్ వాటిపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు జనగణమణ గీతాన్ని అవమానించినప్పుడు అక్కడి స్పీకర్ హుందాగా వ్యవహరించారని రోజా అన్నారు. కాల్వ శ్రీనివాసులు వీడియోలను మీడియాకు విడుదల చేసినా చర్యలు తీసుకోకపోవటం సభకు అవమానమన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన స్థాయిని మరచి తనపై సంపాదకీయం రాశారని, ఎల్లో మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని రోజా ఆవేదన చెందారు. తనను సభకు రాకుండా చేయాలని చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు మీడియాతో కలిసి కుట్ర చేస్తున్నారన్నారు.
చంద్రబాబు నాయుడు... సొంతంగా పార్టీ పెట్టుకొని..సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళితే కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలువలేరని రోజా అన్నారు అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త కావచ్చేమో కానీ ప్రజాసమస్యలకు కొత్తకాదని అన్నారు. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్నందువల్లే వ్యక్తిగత ఆరోపణలకు దిగారన్నారు.