* అధికోత్పత్తికి సహకరించండి
* వ్యవసాయాధికారులతో మంత్రి ప్రత్తిపాటి
* ప్రాథమిక రంగ మిషన్‌పై ముగిసిన సదస్సు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగ ప్రాధమ్యాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం ప్రకటించిన ప్రాధమిక మిషన్‌ను జయప్రదం చేయాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో రెండంకెల ప్రగతిని సాధించినప్పుడే ఈ మిషన్ లక్ష్యం నెరవేరినట్టన్నారు. ప్రాధమిక మిషన్ కార్యాచరణ ప్రణాళిక ఖరారుపై రెండు రోజులుగా ఇక్కడి ఇక్రిశాట్‌లో జరిగిన అధ్యయన గోష్టి బుధవారం ముగిసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ఇప్పటికీ నూటికి 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏయే రంగాలలో అధికోత్పత్తి సాధించడానికి అవకాశం ఉందో పరిశీలించి రైతులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని వ్యవసాయాధికారులకు విజ్ఞప్తి చేశారు.
భూ సార పరీక్ష అవసరాన్ని రైతులకు వివరించడంతో పాటు సూక్ష్మనీటి పారుదల పద్ధతులను ఇతోధికంగా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పాడి, మత్స్య, ఉద్యానవన విభాగాల్లో అధికోత్పత్తికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, వరిలోనూ అధిక దిగుబడి వంగడాలను రైతులకు అందించాలన్నారు. మెట్టప్రాంతాల్లో వేసే స్వల్పకాలిక పంటలపై అవగాహన పెంచాలని, ఇక్రిశాట్ సేవలను వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. అధికోత్పత్తి, యంత్రపరికరాల వినియోగం, సూక్ష్మ నీటి పద్ధతుల అమలే ధ్యేయంగా అధికారులు పని చేయాలని సూచించారు. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో అనుసరించాల్సిన ప్రణాళికలను, విత్తనాలు, ఎరువుల అందుబాటును అధికారులు సమీక్షించారు. జిల్లాల వారీ ప్రణాళికలను ఖరారు చేశారు. ముగింపు సమావేశానికి హాజరైన వారిలో ప్రణాళిక సంఘం ప్రత్యేక కమిషనర్ ఎస్పీ టక్కర్, వ్యవసాయ శాఖ కమిషనర్ కె.మధుసూదనరావు, వివిధ అనుబంధ రంగాల అధికారులు ఉన్నారు.
వ్యవసాయ కమిషనర్ పదవీ విరమణ నేడు
వ్యవసాయ కమిషనర్, డైరెక్టర్ కె.మధుసూదనరావు గురువారం పదవీ విరమణ చేయనున్నారు. 2013లో వ్యవసాయ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన మూడు సీజన్లను జయప్రదంగా నిర్వహించారు. ఉద్యానవన విభాగం డెరైక్టర్‌గా, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన మధుసూదనరావు 1988లో సివిల్ సర్వీసులో చేరారు.
'ప్రాథమిక మిషన్ సక్సెస్ బాధ్యత మీదే'
Published Wed, Apr 29 2015 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement
Advertisement