
పట్టణ శివారుల్లో పార్కింగ్ చేసి ఉన్న ప్రై వేటు ట్రావెల్ బస్సులు
రెక్కలు ముక్కలు చేసుకుని... సొంత ఊరికి, కన్నవారికి సుదూరంగా... రోజువారీ కూలి పనులు చేసుకుని జీవిస్తున్న కుటుంబాలెన్నో జిల్లాలో ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, తదితర ప్రాంతాల్లో ఉంటున్న వీరంతా ఏడాదికోసారి వచ్చే ముఖ్యమైన సంక్రాంతి పండగకోసం సొంత గ్రామాలకు తరలివస్తుంటారు. కానీ వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెలర్స్ ఇష్టానుసారం బస్‌చార్జీలు పెంచేసి... వారి రెక్కల కష్టాన్ని నిలువుగా దోచేస్తున్నారు. సంక్రాంతి పండగ కోసం దాచుకున్న సొమ్ము మొత్తం బస్సు చార్జీలకోసమే వెచ్చించి..కన్నవారికి ఏమీ ఇవ్వలేకపోతున్నారు. వారి కష్టాన్ని మొత్తం బస్సులకు ధార పోస్తున్నారు.
చీపురుపల్లి మేజర్ పంచాయతీకి చెందిన కె.రామారావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన పండగ దగ్గర పడటంతో సొంత ఊరికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి విజయనగరం చేరుకునేందుకు అయిన చెల్లించిన మొత్తం చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మక మానదు. స్లీపర్ క్లాస్ బస్సు ఎక్కిన భార్య భర్తలిద్దరి నుంచి రూ. 5550ల వరకు వసూలు చేశారు. సాధారణ రోజుల్లో రూ. 1800లు ఉండే ధరను ఒక్క సారిగా రెట్టింపు చేయటం గమనార్హం.
విజయనగరం మున్సిపాలిటీ:సంక్రాంతి వచ్చిందంటే సగటు మానవుడి ప్రయాణం గగనమైపోతోంది. సొంత ఊళ్లకు వెళ్లేవారు కొందరైతే, అత్తవారిళ్లకు, అమ్మల వద్దకు వెళ్లి వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలోనే రైళ్ల రిజర్వేషన్లు దొరకని వారు, జనరల్ బోగీల్లో కిక్కిరిసి కూర్చునే ప్రయాణికులను చూసి ఇదేమి ప్రయాణంరా బాబూ అంటూ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న సంబంధిత యజమానులు ఆమాంతం టికెట్ ధరను పెంచేసి ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీ కన్నా రెట్టింపు మొత్తాన్ని గుంజుతున్నారు. రాష్ట్రంలోనేకాకుండా పక్క రాష్ట్రానికి చెందినవారు ఎంతోమంది జిల్లాలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నవారు ఉన్నారు. వీరంతా సంక్రాంతి పండగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. వారంతా ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రం నుంచి ఈ వారం రోజుల్లో రోజుకు 15 నుంచి 25 వరకు రద్దీని బట్టి ప్రైవేటు సర్వీసులు తిరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల వివరాలు ఇలా....
పండగ నేపథ్యంలో ముందుగా వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారిని టార్గెట్ చేసిన ప్రైవేటు సర్వీసు యాజమాన్యాలు హైదరాబాద్ నుంచి వచ్చే వారి వద్ద నుంచి ఏసీ స్లీపర్ సర్వీసుకైతే ఒక్కో టిక్కెటు ధర రూ. 2500ల నుంచి రూ. 2700లవరకూ వసూలు చేస్తున్నారు. ఏసీ సిట్టింగ్ సర్వీసుకైతే రూ. 2వేలు గుంజుతున్నారు. అదే నాన్ ఏసీ సర్వీసులకైతే రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇదే సాధారణ రోజుల్లో అయితే ఏసీ సిట్టింగ్ సర్వీసు ధర రూ 800 నుంచి రూ1000 మాత్రమే ఉండేది. అదే నాన్‌ఏసీ సర్వీసులకైతే రూ600 నుంచి రూ700 ఛార్జీ ఉండేది. విజయవాడ నుంచి విజయనగరం చేరుకోవాలంటే గతంలో ఉన్న ఏసీ స్లీపర్ క్లాస్ టిక్కెట్ ధరను రూ. 700ల నుంచి రూ. 1800ల వరకు పెంచేశారు. అదే నాన్‌ఏసీ టిక్కెటు ధర ఐతే రూ. 400ల నుంచి రూ. 800ల వరకు ధర పలుకుతోంది. ఈ రెండు రోజుల్లో ఇటు నుంచి ప్రయాణానికి మాత్రం సాధారణ ధరలే అమలవుతుండగా.. పండగ అనంతరం రోజుల్లో రెట్టింపు చార్జీలు అమలు చేస్తున్నారు. ఇందుకు సంబందించి ఆయా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో ధరల పట్టికను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచాయి.
ఆర్టీసీలోనూ అదే బాదుడు
సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా తీసుకొని ఆర్టీసీ అడ్డగోలుగా ఛార్జీలు పెంచింది. దూరప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల ద్వారా భారీగా వసూలు చేస్తోంది. దూరప్రాంతాలకు వేసిన సర్వీసుల్లో చార్జీని 50 శాతం పెంచారు. రెండురోజులుగా ఈ సర్వీసుల ద్వారా లక్షల రూపాయలు ఆదాయాన్ని పొందారు. విజయనగరం జిల్లా నుంచి ఒకేఒక బస్సు రెగ్యులర్‌గా ఉంది. కానీ సంక్రాంతి సీజన్‌గా జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ, విజయనగరం డిపోల నుంచి హైదరాబాద్‌కు 15, విజయవాడ 6 బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నిర్వహిస్తున్నారు. వీటిలో సాధారణ సర్సీసుల కంటే 50 శాతం చార్జీలు పెంచారు.
చేతి చమురు తప్పలేదు
ఏడాదికోసారి వచ్చే పండగ. స్వగ్రామాలకు వెళ్లడం తప్పనిసరి. అందువల్ల వారెంత అడిగితే అంత సమర్పిం చుకుని ఈసురోమని స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అయితే ఈ దందా పై కనీసం ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment