ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
అంగన్‌వాడీ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపు నిచ్చారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ 5వ మహాసభలు తిరుపతిలో ఆదివారం జరిగాయి.
తిరుపతి కల్చరల్: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మహిళా కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ 2.5 కోట్ల మందికి చాలీ చాలని జీతాలు ఇస్తూ దోపిడీ చేస్తోందని, అంగన్‌వాడీలు ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేపట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపు నిచ్చారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర 5వ మహాసభలు తిరుపతిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.
చిన్న రాష్ట్రాలైన గోవా, పాండిచ్చేరిలో అంగన్‌వాడీ వర్కర్స్‌కు నెలకు రూ.7 వేలు చెల్లిస్తుంటే మన రాష్ట్రంలో రూ.4200 చెల్లించడం విడ్డూరంగా ఉందన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇటీవల రూ.15 వేలు కనీస వేతనం ఉండాలంటూ భారత్ సహా పలు దేశాలు తీర్మానం చేశాయని తెలిపారు. దాని అమలుకు ప్రభుత్వాలు పూనుకోకపోవడం దుర్మార్గమన్నారు.
ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ డిసెంబర్ 5న దేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఉద్యమించనున్నాయన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యాన విజయవాడలో 20 వేల మందితో పెద్ద ప్రదర్శన చేపడతామన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ మాట్లాడుతూ అంగన్‌వాడీలకు అరకొర జీతాలిస్తూ వారిని కంటతడి పెట్టించవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.
గతంలో హైదరాబాద్‌లో అంగన్‌వాడీ వర్కర్స్‌పై చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించినందుకు ఆయన 9 ఏళ్లు అధికారం కోల్పోయారన్నారు. రాష్ట్ర శ్రామిక మహిళా ఫోరం అధ్యక్షురాలు ప్రేమపావని మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్మికులను ప్రభుత్వం మూడవ గ్రేడ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇతర ఉద్యోగులతో సమానంగా ఎండాకాలం సెలవులు 45 రోజులు ఇవ్వాలని కోరారు.
మహాసభలకు ముందు ఏఐటీయూసీ కార్యాలయం నుంచి అంగన్ వాడీ కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్స్ అధ్యక్షుడు ఆర్.హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లలితమ్మ, అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రవీంద్రనాథ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రేమ, చిన్నమ్మ, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జె.రామచంద్రయ్య, మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, చిన్నం పెంచలయ్య పాల్గొన్నారు.