ఎచ్చెర్ల: నీలిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆన్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) ప్రాజెక్టు 2013 ఏప్రిల్‌లో టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం తర్లికొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి హాదాలో ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో స్థలం కొరత, మరో పక్క శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి దగ్గరగా లేకపోవడంతో మరో ప్రాంతం ఎంచు కోవాలని భావించారు. సరిగ్గా సాధారణ ఎన్నికలు నోటిఫికేషన్ ముందు 2014 ఫిబ్రవరి 28న కేంద్ర ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నీలిట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
యూపీఏ ప్రభుత్వ సమయంలో ఈ రెండు శంకుస్థాపనలు జరిగాయి. అనంతరం ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. దీంతో నీలిట్ ప్రాజెక్టు తెరమరుగయ్యింది. ప్రస్తుతం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శిలాఫలకం వెక్కిరిస్తోంది. దేశంలో నీలిట్ ప్రాజెక్టులు 23 ఉన్నాయని, 24వ ప్రాజెక్టు నిర్మాణం జిల్లాకు గర్వకారణంగా అప్పట్లో నేతలు, అధికారులు చెప్పుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.50 కోట్లలో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
10వ తరగతి, ఆపై చదువులు చదివిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రంగంలో శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పి ంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగ పడడంతో పాటు, ఉపాధికి సైతం దోహద పడేది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం తెరమరుగయ్యింది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అశించిన యువకులకు నిరాశే మిగిలింది. మరో పక్క ఉన్నత స్థాయి వ్యక్తులు శంకు స్థానలు చేశాక ప్రాజెక్టులు కూడా నిలిచిపోతాయా అన్న అంశం సైతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టులు శాశ్వితం కావా అన్నది మరికొందరి వాదన.
శంకుస్థాపనకే నీలిట్ ప్రాజెక్టు పరిమితం
Published Thu, Jan 21 2016 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM
Advertisement
Advertisement