తిరుమల చుట్టూ రక్షణ కవచం
ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సూచనలు
తిరుమల: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రమైన తిరుమలకు చైనా గోడ తరహా రక్షణ కవచం అవసరమని టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద, హింసాత్మక చర్యల నేపథ్యంలో తిరుమల ఆలయానికి టీటీడీ పరిధిలోని 10.3 చదరపు మైళ్ల విస్తీర్ణంలో మహాప్రాకారం (రక్షణ గోడ) నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ అధునాతన సాంకేతిక త, విద్యాప్రమాణాలతో టీటీడీ విద్యాలయాలను నెలకొల్పాని కోరారు. తెలంగాణలోనూ వాటిని విస్తరించి ధార్మిక, నైతికతతో కూడిన నాణ్యమెన విద్య అందించే బాధ్యతను టీటీడీ తీసుకోవాలని సూచించారు.