దేశంలో,రాష్ట్రంలో ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రజా కంటక పాలన సాగిస్తున్నాయని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగించాలి
ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన
అనంతపురం టౌన్ : దేశంలో,రాష్ట్రంలో ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రజా కంటక పాలన సాగిస్తున్నాయని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నాయని మండిపడ్డారు. పెంచిన ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుని నిరసిస్తూ సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఎస్‌యూసీఐ కార్యదర్శి అమర్‌నాథ్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి ఇండ్లప్రభాకర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విలేకరులతో నాయకులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సును, సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచి సామాన్య, పేద వర్గాలపై భారం మోపాయన్నారు. సంస్థలు చెల్లించాల్సిన ట్యాక్స్‌ను కూడా ప్రజలపై రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ప్రజలను మరింత కుంగదీసే విధంగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో వామపక్ష పార్టీల అధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నగర కార్యదర్శి లింగమయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, నాయకులు అల్లీపీరా, బాలపెద్దన్న, పెనచర్లబాలయ్య, ఎల్లుట్లనారాయణస్వామి, రాజేశ్, నరేష్, గాదిలింగ, జయలక్ష్మి, బంగారుబాషా, తదితరులు పాల్గొన్నారు.