ధరలను తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పి బీజేపి ప్రభుత్వం సిగ్గు లేకుండా రెండు వారాల్లో రెండుసార్లు...
ధరలు తగ్గిస్తామని చెప్పి దరువేస్తున్నారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజం
గుంటూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
పట్నంబజారు(గుంటూరు) : ధరలను తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పి బీజేపి ప్రభుత్వం సిగ్గు లేకుండా రెండు వారాల్లో రెండుసార్లు చమురు రేట్లు పెంచిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ శనివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ చమురు రేట్లు పెంచడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని, దీనివలన పేద ప్రజల జీవనం మరింత అస్తవ్యస్తంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ సంస్ధలకు అడుగులకు మడుగులు ఒత్తుతున్న కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సంధర్భంలో ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. పది వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమాలు చేస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచడం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. తొలుత కొత్తపేటలోని సీపీఐ కార్యాలయం నుంచి ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, వెలూగూరి రాధాకృష్ణమూర్తి, షేక్ అమీర్‌వలి, బి.శ్రీనురెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అయ్యస్వామి, నవీనతం సాంబశివరావు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు.