విజయవాడ సిటీ : గుంటూరు జిల్లాకు చెందిన పాతికేళ్ల యువకుడు బెంజసర్కిల్, పాతబస్తీ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, ప్రముఖ వస్త్ర దుకాణాలకు వెళుతుంటాడు. అక్కడ ఖరీదైన కుటుంబాలకు చెందిన మహిళలు, యువతుల వద్దకు వెళ్లి తాను పర్సు మరిచిపోయానని, ఒకసారి ఫోన్ ఇస్తే తన సోదరునికి ఫోన్ చేసుకుంటానంటూ చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. కొనుగోళ్ల హడావుడిలో ఉన్న వారు ఇతను అడిగినట్టుగానే మొబైల్ ఇస్తారు. ఆ తర్వాత తన మొబైల్‌కు వారి మొబైల్ నుంచి మిస్డ్‌కాల్ ఇచ్చుకొని తిరిగిచ్చేస్తాడు.
ఆ మరుసటి రోజు నుంచి తన సైకో చర్యలు ప్రారంభిస్తాడు. సమయ పాలనతో నిమిత్తం లేకుండా అసభ్యకర పదజాలంతో వారిని వేధింపులకు గురి చేస్తుంటాడు. ఇప్పటి వరకు 15 నుంచి 20 మంది వరకు ఈ తరహా వేధింపులు చేసినట్టు తెలిసింది. వీరిలో ఒక బాధిత కుటుంబం ధైర్యం చేసి విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యూహాత్మకంగా ఇతణ్ణి అదుపులోకి తీసుకున్నారు.
గతంలో పట్టుకునేందుకు వెళ్లిన వారి నుంచి వివరాలు సేకరించిన టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం ఉదయం సైకో చెప్పిన ప్రాంతానికి ముందుగానే 20 మంది సిబ్బందిని సాధారణ దుస్తుల్లో పంపారు. అక్కడ వారు ఏదో పనులు చేస్తున్నట్టు నటిస్తూ ఫోన్లు మాట్లాడే వారిని నిశితంగా గమనించసాగారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు సైకో నంబరుకు కాల్ చేశారు. ఫోన్ రింగైన వెంటనే చూసుకున్న సైకో ఆన్సర్ చేయకుండా అధికారుల చర్యలను గమనించసాగాడు.
అప్పటికే అక్కడ మాటు వేసిన సిబ్బంది ఫోన్ రింగైన యువకుని వద్దకు వెళ్లి గమనించారు. అధికారులు పదే పదే చేస్తున్నా ఇతను చూసుకోవడం మినహా ఆన్సర్ చేయడం లేదు. సైకో ఇతనేనని నిర్థారించుకొని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాలు అంగీకరించాడు. అరెస్టు చేసి జైలుకు పంపారు. బాధిత కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.
సైకోకి సంకెళ్లు
Published Mon, May 25 2015 12:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
Advertisement
Advertisement