సైకో దాడిలో గాయపడిన మహిళను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఆత్మకూరు : పిల్లలను పాఠశాలలో వదిలి తిరిగి ఇంటికి వస్తున్న మహిళపై ఓ సైకో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణంలో శనివారం జరిగింది. ఈ ఘటన పట్టణంలో కలవరపరిచింది. బాధితురాలు, పోలీసుల సమాచారం మేరకు.. పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన దివానపు లక్ష్మీప్రసన్న తన ఇద్దరు పిల్లలను సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో వదిలి తిరిగి శివారులోని డొంక దారిలో ఇంటికి వస్తోంది. అప్పటికే ఆమెను అనుసరిస్తూ వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు కలిపి దాహంగా ఉంది, మంచి నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అడిగాడు. దూరంగా ఉన్న కాలనీ ఇళ్లలో అడిగి తాగాలని సూచించింది. అయినా అతను ఆమెనే అనుసరించి వస్తుండగా జనసంచారం లేని ప్రాంతంలో టవల్‌ను ఆమె మెడకు చుట్టి ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు.
దీంతో ఆమె గొంతుకు టవల్ బిగియకుండా పట్టుకుని పెనుగులాడింది. కింద పడిపోయిన ఆమె గట్టిగా విదుల్చుకుని టవల్‌ను తీసివేయడంతో అతను పరారయ్యాడు. ఆమె కిందపడి సమయంలో రాయి తగిలి తీవ్రంగా రక్త గాయమైంది. కొద్ది సేపటికి అటుగా వస్తున్న ఓ వ్యక్తి ఆమెను గమనించి, మరో ఇద్దరి సహాయంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై పీ నరేష్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను విచారించారు.
ఎమ్మెల్యే పరామర్శ
మహిళపై సైకో దాడి జరిగినట్లు సమాచార విషయం తెలియడంతో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఆయన ఎస్సైతో మాట్లాడుతూ సైకో దాడి మరొకటి జరగక ముందే చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment