ప్రజాశక్తి నగర్‌లో దారుణం
అనంతపురం క్రైం :
అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని ప్రజాశక్తినగర్‌లో నివాసముంటున్న హేమావతి ఇంట్లో సోమవారం రాత్రి సామన్లు ధ్వంసమయ్యాయి. కాలనీవాసులే ఈ దారుణడానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన మేరకు... నెల రోజుల కిందట కాలనీలోని కొన్ని ఇళ్ల ముందు పసుపు, కుంకుమ, నూగులు, ఇతర ధాన్యాలతోపాటు ఓ జంతువు మాంసం ముద్దలు పడి ఉన్నాయి. క్షుద్రపూజల్లో భాగంగా ఇలా చేశారని స్థానికులు గుర్తించి.. ఓ స్వామిని కాలనీకి తీసుకొచ్చి చూపించారు. ఆయన కొందరి ఇళ్లపై అనుమానం వ్యక్తం చేశారు. సదరు ఇళ్లల్లోని ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి రోడ్డుపై నిలబెట్టారు. ఆ తర్వాత రూరల్ పోలీసులకూ వారిపై ఫిర్యాదు చేశారు.
పోలీసులు కాలనీలో విచారణ చేసి.. ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. తమ ప్రమేయం లేకపోయినా బాధ్యులను చేసి ఇబ్బందులకు గురి చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు కాలనీలోకెళ్లిన రూరల్ పోలీసులు తూతూమంత్రంగా విచారణ చేసి మిన్నకుండిపోయారు. కాలనీవాసుల చేతిలో దాడికి గురైన ముగ్గురు మహిళల్లో ఒకరైన హేమావతి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఈమె సోమవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చింది. అప్పటికే తలుపు తెరిసి ఉండడంతో లోనికెళ్లి పరిశీలించింది. తలుపు, టీవీ, ఇతర వస్తువులు ధ్వంసమై ఉండటంతో బాధితురాలు బోరున విలపించింది. కాలనీవాసులు కుళ్లాయప్ప, శివారెడ్డి, మద్దెలచెరువు నాగార్జున, మంజునాథ, చిట్టి, రాధ, అరుణ, శిరీష, మున్నీ, తేజ, ఆంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల కిందట అవమానం చేసి.. ఇప్పుడు మళ్లీ ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడమేంటని హేమావతి విలపించింది. తన తప్పు ఉంటే జైలుకు పంపాలే కానీ.. దౌర్జన్యం చేయడం తగదని పేర్కొంది. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా దాడులు కొనసాగుతుండటం చూస్తే తన ప్రాణానికి కాలనీవాసుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలిపింది. తనతోపాటు మరో ఇద్దరిని అవమానపరిచిన రోజే పోలీసులు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కన్నీటిపర్యంతమయ్యింది. వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది.