పీఏసీ తొలి భేటీలో స్వీకర్ కోడెలతో చైర్మన్ భూమా నాగిరెడ్డి
ప్రజా పద్దుల కమిటీ తొలి భేటీలో స్పీకర్ కోడెల హితవు
కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమా
సాక్షి, హైదరాబాద్: ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) అలంకారప్రాయం కాకూడదని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అరికట్టడంలో సమితి క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పీఏసీ తొలి సమావేశాన్ని కోడెల శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, పనుల్లో ఏైదె నా అవినీతి జరిగినట్లు కమిటీ పరిశీలనకు వస్తే ప్రభుత్వంతోపాటు అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సభ్యులు క్రియాశీలంగా వ్యవహరించాలన్నారు.
ప్రజాధనం దుర్వినియోగం కానీయొద్దు
కమిటీ చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ కమిటీలన్నింటిలో పీఏసీ కీలకమైందన్నారు. ప్రజాధనం ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రయత్నిద్దామన్నారు. అందుకు అందరి సహకారం కావాలన్నారు. అందరూ ఒక బృందంగా పనిచేద్దామన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ గత పీఏసీలో కూడా తాను సభ్యుడినని, అపుడు నిర్వహించిన సమావేశాలకు అధికారులు సక్రమంగా హాజరయ్యేవారు కాదని, శాఖాపరమైన సమీక్షలు సక్రమంగా జరగాలంటే అధికారుల హాజరు తప్పనిసరని అన్నారు.
శాసనసభ సచివాలయ ప్రభుత్వ అధికారులు సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సభ్యులందరం కలిసి పనిచేసి అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిద్దామన్నారు. కమిటీ ఆషామాషీగా కాకుండా గట్టిగా పని చేయాలన్నారు. బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పీఏసీ స్థాయిని పెంచేందుకు సభ్యులందరం కలిసి ప్రయత్నిద్దామన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అరికడదామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి కె. సత్యనారాయణ మాట్లాడుతూ కమిటీ సమావేశానికి రెండు వారాల ముందు తమకు సమాచారం అందిస్తే అన్ని శాఖల అధికారులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కాకాణి గోవర్ధనరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, బీకే పార్థసారథి, పీవీజీఆర్ నాయుడు, ఎంవీఎస్ శర్మ, శమంతకమణి, రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.