ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ | Public Awareness Of Corona Virus | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌

Published Wed, Jan 22 2020 6:54 AM | Last Updated on Wed, Jan 22 2020 12:17 PM

Public Awareness Of Corona Virus - Sakshi

సాక్షి, గుంటూరు : ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రాణాంతక వైరస్‌ విజృంభించి, మన దేశంలోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు.   

కరోనా వైరస్‌ అంటే ? 
కరోనా వైరస్‌ను 1937లో గుర్తించారు. ఈ వైరస్‌ ఎక్కువగా కోళ్లు, చుంచుఎలుకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిళాల ఊపిరితిత్తుల వ్యాధులకు కరోనా వైరస్‌ కారణమవుతోంది. కొన్ని రకాల కరోనా వైరస్‌లు మానవుల్లో కూడా సాధారణ జలుబు, ఫ్లూ ఫీవర్‌ వంటి స్వల్ప కాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని 1960లో  గుర్తించారు. కాలక్రమేణా ఈవైరస్‌ల్లో ఉత్పరివర్తనలు జరిగి మనిషికి ప్రాణాంతక వైరస్‌లుగా మారాయని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు రకాల హ్యూమన్‌ కరోనా వైరస్‌లను గుర్తించారు. వీటినే 229 ఈ – ఆల్ఫాకరోనా వైరస్, ఓసీ 43, బీటా కరోనా వైరస్, హెచ్‌కేయూ 1 బీటా కరోనా వైరస్, సార్స్‌ కరోనా వైరస్, మెర్స్‌ కరోనా వైరస్, నోవెల్‌ కరోనా వైరస్‌లుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాలోని ఊహన్‌ నగరంలో విజృంభిస్తున్న వైరస్‌ను నోవెల్‌ కరోనా వైరస్‌గా గుర్తించారు.  

శ్వాసకోశ వ్యాధులకు కారణం 
లాటిన్‌ భాషలో కరోనా అంటే క్రౌన్‌ అని అర్ధం. క్రౌన్‌ లేదా, హేలో ఆకారంలో వైరస్‌ ఉండటం వల్ల దీనికి ఆపేరు పెట్టారు. ఈవైరస్‌ మానవుల్లో ఊర్ధ్వ శ్వాసకోశ వ్యాధులకు (అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌), జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతోంది. ఈ వైరస్‌సోకిన వారిలో జలుబు (రన్నింగ్‌ నోస్‌), గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. సీతాకాలంలో, వేసవి కాలం ప్రారంభంలో ఎక్కువగా ఈవైరస్‌ సోకుతోంది. కొందరిలో బ్యాక్టీరియల్‌ బ్రాంకైటీస్, న్యూమోనియాకు ఈవైరస్‌ కారణమై ప్రాణాంతకమవుతోంది. 2003లో ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించిన ఈవైరస్‌ బారిన 8098 మంది పడగా అందులో 774 మంది మృతిచెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2012 సౌదీ అరేబియాలో, మరలా 2013లో సౌదీ అరేబియాలో 124 మందికి వైరస్‌ సోకి వారిలో 52 మంది మృతిచెందినట్లు గుర్తించారు. 2014లో అమెరికాలో, 2015లో కొరియాలో వ్యాధిని గుర్తించారు. 2019 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాప్తంగా 2,468 కేసులు నమోదు కాగా, వారిలో 851 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
 
వైరస్‌ ఎలా వ్యాప్తిస్తుంది? 
హ్యూమన్‌ కరోనా వైరస్‌లు వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతాయి. వైరస్‌ వ్యాప్తి చెందడంలో ముక్కు, నోటి నుండి స్రవించే స్రావాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వైరస్‌ సోకిన వ్యక్తులు తుమ్మడం, దగ్గడం వల్ల వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాప్తిచెందుతోంది. ఆ తుంపరలతో కలుషితమైన దుస్తులు, ఇతర వస్తువులు, కరచాలనం, తాకడం వల్ల వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ప్రవేశిస్తుంది. అరుదుగా మలమూత్రాల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.

లక్షణాలు...  
వైరస్‌ సోకిన రెండు లేదా మూడు రోజుల్లోనే లక్షణాలు బయలపడతాయి. వ్యాధి లక్షణాలను బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్‌ లక్షణాలుగా విభజించారు. మైల్డ్, మోడరేట్‌ లక్షణాల్లో ముక్కుల నుంచి స్రావాలు కారడం (రన్నింగ్‌ నోస్‌), దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఫ్లూ జ్వరం, కామన్‌ కోల్డ్‌ లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్‌లు శ్వాస నాళాలు, శ్వాస కోశాలకు వ్యాపించినప్పుడు బ్రాంకైటీస్, న్యూమోనియా లక్షణాలు బయటపడతాయి. 
తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, అవయవాలు మార్పిడి చేయించుకున్నవారిలో, క్యాన్సర్, ఎయిడ్స్‌ బాధితుల్లో, ఎక్కువ కాలం విచక్షణా రహితంగా స్టెరాయిడ్స్‌ వాడిన వారిలో, ఊపిరి తిత్తుల వ్యాధుల బాధితులు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.  

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మంచినీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. వ్యాధిపై అప్రమత్తతో ఉండి ముఖానికి మాస్క్‌ ధరించాలి. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు, కోళ్ల ఫారాలు, జంతు సంరక్షణ శాలలు, కబేళాల దగ్గరకు వెళ్లకూడదు. అనుమానితులకు, ఇతురులకు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా, కర్చీప్‌ అడ్డుపెట్టుకోవాలి. తరుచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.           – డాక్టర్‌ తాతా సేవకుమార్, గుంటూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement